‘శతాబ్ది’ కలిగేనా లబ్ధి..? | Osmania University Centennial Celebrations | Sakshi
Sakshi News home page

‘శతాబ్ది’ కలిగేనా లబ్ధి..?

Published Tue, Apr 18 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

‘శతాబ్ది’ కలిగేనా లబ్ధి..?

‘శతాబ్ది’ కలిగేనా లబ్ధి..?

నాలుగేళ్లుగా నిలిచిపోయిన అధ్యాపక నియామకాలు
కాంట్రాక్టుపై 1800మంది ఉద్యోగులు, 600మంది అధ్యాపకులు
పర్మినెంట్‌ చేయాలని ఎదురుచూపులు


తార్నాక: ఒక వైపు శతాబ్ది ఉత్సవాల వైపు పరుగులు తీస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ.. మరోవైపు బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో వర్సిటీ బోధనా, పరిశోధనా రంగంలో కొంత వెనుకబాటుకు గురవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యాపకుల కొరతను తీర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన భర్తీ ప్రక్రియ చేపట్టని అధికారులు.. కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన సాగిస్తూ వర్సిటీని ముందుకు నెట్టుకొస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కొనసాగుతున్న తమను ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా పర్మినెంట్‌ చేసి శాశ్వత భృతి కల్పిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నామని కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు.

వేతనాలు చాలా తక్కువ...
వర్సిటీలో పర్మినెంట్‌ అధ్యాపకులతో పోటీపడి విధులు నిర్వర్తిస్తూ వర్సిటీని కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగులు, అధ్యాపకుల వేతనాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్న తొలి రోజుల్లో అధ్యాపకులు పరిపాలనా భవనం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం ఉద్యోగాలు పర్మినెంట్‌ చేసేందుకు కావాల్సిన సాధ్యాసాధ్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేసి వారిని ఆందోళన నుంచి తప్పించారు.

తగ్గిన ప్రొఫెసర్‌ పోస్టులు...
వర్సిటీలో పదవీ విరమణ పొందుతున్న అధ్యాపకుల సంఖ్య పెరుగుతుండటంతో కొన్ని విభాగాలకు అధ్యాపకులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అధ్యాపకులతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేని విభాగాలు ఎనిమిది వరకు ఉన్నాయి. సైకాలజీ విభాగంలో 11 మందికి గాను ఇద్దరే అధ్యాపకులు ఉన్నారు. జియో ఫిజిక్స్‌లో 24 పోస్టులకు గాను ముగ్గురే ఉన్నారు. ఉర్దూ విభాగంలో 19మందికి గాను నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

నియామకాలు లేవు..
ఓయూలో 12 ఏళ్లుగా బోధనేతర సిబ్బంది నియామకాలు లేవు. ఆయా విభాగాల్లో ఉన్నవారికి పదోన్నతులు కల్పించడంతో ఏర్పడిన ఖాళీల్లో కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేసి పనులు కొనసాగిస్తున్నారు. అధ్యాపకుల విషయానికొస్తే 1989, 1993, 1997లో అధ్యాపక నియామకాలు చేపట్టారు. నియామకాల్లో కొన్ని కోర్టు వివాదాల కారణంగా అన్ని పోస్టులను భర్తీ చేయలేదు. తరా>్వత 2007లో, 2013లో తిరిగి నియామకాలు చేపట్టినా ఖాళీలన్నీ భర్తీ కాలేదు.

పనిచేస్తున్న అధ్యాపకులు 585 మందే..
మొత్తం 56 విభాగాలకుగాను మంజూరైన అధ్యాపక పోస్టులు 1267. అయితే ప్రతియేటా పదవీ విరమణ పొందడం, మరో వైపు నియామకాలు లేకపోవడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఓయూలో శాశ్వత ప్రాతిపదికన 585 అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 600 మంది అధ్యాపకులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో  మరో 1800 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది.

మాపై దయ చూపండి...
శతాబ్ది ఉత్సవాల సందర్బంగానైనా కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌(కాంట్రాక్టు) అధ్యక్షుడు డాక్టర్‌ ఏ.పరశురాములు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement