రాష్ట్రమంతా పండుగలా జరపాలి
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: కేసీఆర్
విశ్వవిద్యాలయం గత వైభవాన్ని తిరిగి తేవాలి
అందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని నూతన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి నెలకొల్పాలన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించే ఈ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో సీఎం సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉట్టి పడాలని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ ప్రాంగణంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న కాలేజీలు, హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ తదితర కాలేజీల్లోనూ పండుగ శోభ కనిపించాలన్నారు. కాకతీయ తదితర యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ యూనివర్సిటీలో చదివి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వివిధ రంగాలకు చెందిన వారందరినీ ఆహ్వానించి గౌరవించాలని సూచించారు. అన్ని యూనివర్సిటీల వీసీలతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ‘‘ఉత్సవాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించాలా? ఏర్పాట్లు, కార్యాచరణ ఎలా ఉండాలి? గతంలో దేశంలో శతాబ్ది ఉత్సవాలు చేసుకున్న యూనివర్సిటీలు ఎలా నిర్వహించాయి..? తదితర అంశాలన్నీ పరిశీలించాలి. ఉత్సవాల నిర్వహణపై సమగ్ర నివేదిక అందజేయాలి’’అని డిప్యూటీ సీఎం కడియం, ఎంపీ కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీని ఆదేశించారు.
వర్సిటీల్లో మౌలిక వసతులు కల్పించాలి
ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీల్లో ఒకటిగా వెలుగొందిన ఉస్మానియా క్రమేణా తన వైభవాన్ని కోల్పోవడం దురదృష్టకరమని సీఎం అన్నారు. చారిత్రక ఘనతను తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు. తెలంగాణవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. యూనివర్సిటీలను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా వైస్ చాన్స్‌లర్లు నడుం బిగించాలని సూచించారు. మెస్ చార్జీలతో సహా హాస్టల్ వసతులు తదితర అన్ని మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ కె.కేశవరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు, ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రరావు, కాకతీయ వర్సిటీ వీసీ సాయన్న, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, తెలంగాణ వర్సిటీ వీసీ సాంబయ్య, జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ కవితా దర్యానిరావు, నల్సార్ యూనివర్సిటీ వీసీ ఫైజాన్ ముస్తఫా, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.