మన కల సాకారమవుతోంది
♦ మహారాష్ట్రతో ‘గోదావరి’ ఒప్పందంపై సీఎం కేసీఆర్
♦ బీడు వారిన భూములకు నీళ్లొస్తాయి
♦ తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో..ఈరోజు కూడా అంతే సంతోషపడుతున్నా
♦ బేగంపేట విమానాశ్రయంలో సీఎంకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సాధించుకున్న నాడు ఎంత సంతోష పడ్డానో.. ఇవ్వాళ కూడా అంతే సంతోష పడుతున్నా. మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండలోని ఆలేరు, భువనగిరి ప్రాంతాలు అద్భుత ఫలితాలు సాధిస్తాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. కొద్దిపాటి ఇబ్బంది కలిగితే ఆత్మహత్యలు చేసుకోకండి. మన కల సాకారం అవుతోంది. రెండు పంటలకు నీళ్లు వస్తాయి. ఒట్టిపోయి, బీడు బారిన నేలలకూ నీళ్లందుతాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు, ఘన స్వాగతం పలికారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద సీఎం మాట్లాడారు. ‘‘ఏడాది కిందట నేనే స్వయంగా మహారాష్ట్ర సీఎంను కలిసి చర్చించిన. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామన్న. మహారాష్ట్రలో వెనకబడిన విదర్భ కోసం మీరూ నీళ్లు తీసుకోమని చెప్పా. వారం రోజుల కిందట మహారాష్ట్ర సీఎం ఫోన్ చేశారు. ‘రావు గారూ.. మనం ప్రాజెక్టులు నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. మా అనుమానాలు తీరాయి.
అధికారులతో కలిసి రండి.. ఒప్పందం చేసుకుందాం’ అని ఆహ్వానించారు. ఈ ఒప్పందంతో మన కల సాకారం అవబోతోంది. మన భూములకు నీళొస్తాయి. నోరు మంచిదైతే, ఊరు మంచిదైతది అంటరు. ఓర్పు, సహనం, సమన్వయంతో పని చేసుకుంటూ పోతున్నం. ప్రాణహిత, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితే.. తొమ్మిది జిల్లాలో కోటి ఎకరాలకు నీరు అందుతుంది’’ అని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే నల్లగొండ జిల్లాలో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ప్రజలకు నీరందుతుందన్నారు. రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. జంట నగరాలకు 24 గంటల నీటి సరఫరా చేసే లక్ష్యంతో శామీర్‌పేట్ వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని, కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ మాగాణి భూముల్లో పారిస్తామన్నారు. బంగారు తెలంగాణ సాధించే వరకు నిద్రపోమని పేర్కొన్నారు.
ఈ ఘనత హరీశ్‌దే..
మహారాష్ట్రతో ఒప్పందం కోసం యువ నాయకుడు హరీశ్‌రావు రాత్రింబవళ్లు కష్టపడ్డారని సీఎం చెప్పారు. ‘‘ఈ ఒప్పందం ఘనత మంత్రి హరీశ్‌రావుదే. ప్రాజెక్టుల విషయంలో హరీశ్ ఎంతో కష్టపడుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్రతో ఒప్పందం కోసం తీవ్రంగా కృషి చేశారు. పలుమార్లు మహారాష్ట్రకు వెళ్లి సీఎంతో, అక్కడి సాగునీటి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. హరీశ్ చొరవతోనే మహారాష్ట్ర సానుకూలంగా స్పందించింది. ప్రాజెక్టుల వల్ల ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని మహారాష్ట్ర సర్కారుకు వివరించాం. తెలంగాణ ఇవ్వాళ సస్యశామలం కానుంది. ఈ ఒప్పందంతో తెలంగాణ ప్రజల కల సాకారమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి శుభాకాంక్షలు చెబుతున్నా..’’ అని సీఎం అన్నారు.