పరోపకారార్థం... మన హైదరాబాదీ!
పరోపకారం చేయడం అంటే సగటు హైదరాబాదీకి ఎంతో ఇష్టం. రోజులో ఏదో మంచి కార్యం చేయనిదే అతడికి పొద్దు గడవదు. సాధారణంగా మోటారు సైకిళ్లను అందరూ నడపటం కోసం, ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లడం కోసం ఉపయోగిస్తారు. కానీ హైదరాబాదీ యూత్ మాత్రం పరోపకారం కోసం యూజ్ చేస్తారు.
ఆరోజున ఇద్దరు యువకులు కూర్చున్న మోటార్ బైక్స్ కట్స్ కొడుతూ చకచకా టర్నింగ్స్‌లో పడుతూ లేస్తూ రివ్వున దూసుకువస్తోంది. ఆ స్పీడ్ మీద స్కిడ్ అయితే ఎందరెందర్ని పడేస్తాడో అని నా ఆందోళన. కానీ అంత వేగంగా వచ్చిన ఆ కుర్రాళ్లు వెనక కూర్చున్న అమ్మాయి చున్నీ ప్రమాదానికి అంచున ఉందని హెచ్చరిస్తారు.
చక్రంలో ఇరుక్కోకుండా తన ‘హెచ్చరిక చక్రం’ అడ్డేస్తాడు. అలా దంపతుల్ని రక్షించాక థ్యాంక్స్ కూడా ఆశించకుండా వేగంగా వెళ్లిపోతాడు. బావ కళ్లలో ఆనందం చూడటమే వాళ్ల లక్ష్యమని మనకు తెలిశాక మన యూత్‌పై ఎంతో గౌరవం పెరుగుతుంది మనకు.
మనం వేగంగా ఏదో పని మీద బైక్‌పై పరధ్యానంగా వెళ్తుంటాం. దారిన పోయేవారు విచిత్రంగా మనల్ని ఏదో కామెంట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ‘ఛీ... ఈ పోకిరీలకు పనీపాటా ఏమీ లేదు’ అనుకునే లోపే... ఇంగ్లిష్ థ్రిల్లర్‌లోని ఛేజింగ్ సీన్‌లా మరో ఇద్దరు కుర్రాళ్లు వచ్చేసి ‘సైడ్ స్టాండ్’ అంటూ మనల్ని హెచ్చరించి సైడైపోతారు. దాంతో దారి పొడవునా పరోపకార బుద్ధితో మనల్ని హెచ్చరిస్తుండగా, మనం వాళ్లను అపార్థం చేసుకున్నందుకు ఎంతో విచారిస్తాం.
అలా సైడ్‌స్టాండ్ వల్ల పడిపోవడం నుంచి కాపాడబడి పశ్చాత్తపం వైపు పడిపోతాం మనం.
బస్ ఎక్కి చంకలో విలువైన ఫైళ్లతో మనం నిలబడతాం. కానీ మనకు సీటు దొరకలేదు. కానీ పైన రాడ్ పట్టుకుని పడకుండా స్థిరంగా ఉండాలంటే చేయి ఎత్తాలి. అలా ఎత్తితే ఫైళ్లు పడిపోతాయి, ఎత్తకపోతే మనం పడిపోతాం. ఆ కష్టకాలంలో సీటులో కూర్చున్న పాపన్నలు... చొరవగా మన ఫైలందుకుని మనల్ని నిటారుగా నిలబెడతారు.
ఎప్పట్నుంచో నాదో కోరిక. ఎంతో మంది పెద్దపెద్దవాళ్ల ఫొటోలను ఫ్లెక్సీలుగా మార్చి పెడుతుంటారు వాళ్ల అనుచరులు. కానీ నేను సామాన్యుడిని కదా, అనుచరులెవ్వరూ లేనివాణ్ణి కదా అన్నదే నా విచారం. కానీ ఈ బాధ లేకుండా నాలోనూ ఒక విశ్వాసాన్ని పాదుకొల్పింది నగర యువత. మా వీధిలో ఎవరో చనిపోతే వాళ్ల ఫొటో ఒకటి తీసుకుని, దాన్ని పదో, పన్నెండో జిరాక్స్ తీయించి, వెదురు బద్దకు అతికించి... అతడి ఇంటి పరిసరాల్లోని నాలుగు రోడ్ల ప్రతి కూడలిలోనూ అమర్చారు.
అతడి మరణానికి నివాళి అర్పిస్తూ అరటి పండ్ల స్టాండుకు అగరొత్తులు వెలిగించారు. అప్పుడు నా మనసుకెంతో తృప్తి కలిగింది. రేపు నేను పోయినా ఫ్లెక్సీ కాకపోతేమానె... కనీసం కలర్ జిరాక్సుతో చౌరస్తాలో వెదురు బద్దకు వేలాడుతామన్న తృప్తి కలిగింది నాకు. సామాన్యుణ్ణి సైతం సెలబ్రిటీలా చూసుకునే పరోపకారి హైదరాబాదీ... జిందాబాద్!