మోదీని కేసీఆర్ కలిశాకే ఆ అవకాశం
పాత నోట్లతో రైతులకు విత్తనాల కొనుగోలు వెసులుబాటుపై పల్లా
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని ప్రధానికి తెలిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మోదీని కేసీఆర్ కలసిన తర్వాతే రైతులకు పెద్ద నోట్లతో విత్తనాలు కొనే అవకాశం లభించిందని తెలిపారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యలు తీసుకుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో కేసీఆర్ నిర్మాణాత్మక వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పారు.
మహిళలు పోపు డబ్బాలో దాచుకున్న మొత్తాలను నల్లడబ్బుగా పరిగణించవద్దని కేసీఆర్ మోదీని కోరి దేశవ్యాప్తంగా మహిళల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన తర్వాతే దేశవ్యాప్తంగా పాతనోట్లతో మున్సిపల్, ఇతర బిల్లులు కట్టేందుకు అవకాశం లభించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇప్పటికే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, ఇంకా అవాకులు చవాకులు పేలితే భూస్థాపితం చేయడం ఖాయమన్నారు.