ఖైకే పాన్ పామర్రు వాలా!
బెనారస్ వాలాకైనా.. ఏలూరు చిన్నోడికైనా.. హైదరాబాద్ బుల్లోడికైనా.. దవడ కిందకు కారా కిళ్లీ చేరితే మెదళ్లకు
పట్టిన తుప్పు వదిలిపోతుంది. అదే మృష్టాన్న భోజనం తర్వాత ఓ మీఠా పాన్ లాగిస్తే గానీ.. అంతరంగమున ఆత్మారాముడు
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనలేడు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. పల్లె నుంచి పట్నం వరకూ పాన్‌షాప్‌లకు ఉన్నంత
గిరాకీ మరే కొట్టుకూ ఉండదు. కిళ్లీ కట్టడంలో హస్తవాసికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొందరు అర నిమిషంలో
కి ళ్లీ చుట్టిచ్చినా అద్భుతః అన్నట్టు ఉంటుంది. అలాంటి పాన్‌వాలానే పామర్రుకు చెందిన జగపతి. అందుకే కృష్ణా జిల్లాలో
చుట్టిన ఆయన కిళ్లీ హైదరాబాద్‌లో కూడా ఫేమస్ అయింది.
ఎల్లలు దాటిన ఈ కిళ్లీ రుచికి పెద్ద చరిత్రే ఉంది. ఆరు దశాబ్దాల కిందట కృష్ణా జిల్లా పామర్రులో జగపతి కిళ్లీ చుట్టడం ప్రారంభించారు. రకరకాల ఐటమ్స్‌తో రుచికరమైన కిళ్లీలు తయారు చేసేవాడు. దీంతో అనతి కాలంలోనే జగపతి కిళ్లీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినీ ప్రముఖులు, రాజకీయ ఉద్దండులు సైతం గుంటూరు వెళ్తే జగపతి కిళ్లీ తెప్పించుకుని మరీ నోరారా తినేవారు. ఈయనగారి కిళ్లీలు తిరుపతి, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలు, చెన్నైకి కూడా వెళ్తుంటాయి. అదే క్రమంలో జగపతి కుమారుడు రామకృష్ణ హైదరాబాదీలకు పామర్రు కి ళ్లీ రుచి చూపిస్తున్నారు. 2001లో కూకట్‌పల్లి మలేసియా టౌన్‌షిప్
సమీపంలో చైతన్య ఫుడ్ కోర్టు ప్రారంభించారు. ఓ వైపు పసందైన భోజనంతో పాటుగా.. అంతే రుచికరమైన తీపి
తాంబూలం కూడా అందిస్తున్నారు.
మన్‌పసంద్ పాన్..
పామర్రులో తయారు చేసే కిళ్లీలు ప్రతిరోజూ ఇక్కడకు చేరుకుంటాయి. స్వీట్ పాన్, పీటీ కిళ్లీ, రత్న ఇలా 100 పేర్లతో రకరకాల కిళ్లీలు వీళ్లు అందిస్తున్నారు. జాజికాయ, జాపత్రి, లవంగం, మీనాక్షి లాంటి వాటితో పాటు సుగంధ ద్రవ్యాలు కలగలిపి మన్‌పసంద్ పాన్ తయారు చేస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే ఇందులో వినియోగిస్తుంటారు. ఒక్క స్వీట్‌పాన్‌లోనే 30 రకాల పదార్థాలను వినియోగిస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పామర్రు తాంబూలాలకు భలే గిరాకీ ఉంటుంది. పాన్‌లు చుట్టడానికే పామర్రులో ప్రత్యేకంగా ఓ కుటీర పరిశ్రమ నడిపిస్తున్నారు వాళ్లు. దూరప్రాంతాలకు పంపాల్సిన కిళ్లీలు పాడవకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరు రూపాయల నుంచి రూ.600 వరకు ధర పలికే కిళ్లీలు ఇక్కడ దొరుకుతాయి. ఖరీదైన కిళ్లీల్లో కుంకుమపువ్వు, బంగారు ర్యాపర్ కూడా వాడుతుంటారు. పామర్రులో పకడ్బందీగా చుట్టిన ఈ కిళ్లీలతో హైదరాబాదీల నోరు పండిస్తున్నారు రామకృష్ణ.
కోన సుధాకర్‌రెడ్డి