'కొడుకు కోడలు నుంచి విముక్తి కల్గించండి'
'కొడుకు కోడలు నుంచి విముక్తి కల్గించండి'
Published Sat, Mar 11 2017 10:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: కొడుకు, కోడలు నుంచి విముక్తి కలిగించాలని వృద్ధ దంపతులు ఇంటి ముందు రెండు రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కొత్తగూడలోని ప్రశాంత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కడలి రాందాసు(65) కొండాపూర్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2010లో రిటైర్ అయ్యారు. ప్రశాంత్ నగర్‌లో 150 చదరపు గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. రిటైర్ అయిన వెంటనే మరో రెండు అంతస్తుల ఇల్లు నిర్మించామని రాందాసు తెలిపారు.
అందుకుగాను రూ.10 లక్షల వరకూ అప్పు చేయాల్సివచ్చిందని చెప్పారు. రెండంతస్తుల భవనంలో తల్లిదండ్రులు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తుండగా.. మొదటి అంతస్తులో పెద్దకొడుకు సుబ్బారావు, కోడలు నాగలక్ష్మీ.. రెండో అంతస్తులో చిన్న కొడుకు నర్సింహారావు, కోడలు నాగ వరలక్ష్మీలు నివసిస్తున్నారు. అయితే పెద్ద కొడుకు ఆస్తి పంపకాలు చేయాలని గొడవపడటమే కాకుండా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి పోలీసుల ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. పెద్ద కోడలు, కొడుకుల నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. వారు ఇళ్లు వదిలి వెళ్లిపోయే వరకూ గేటు ముందే ఉంటామని తెలిపారు.
మాకూ న్యాయం చేయండి: సుబ్బారావు
మా తాత సంపాదించిన రెండు ఎకరాల పొలం అమ్మి వచ్చిన డబ్బులు, నా భార్య తెచ్చిన రెండు లక్షల కట్నం, 10 కాసుల బంగారంతో ఇళ్లు కట్టారని పెద్ద కొడుకు సుబ్బారావు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్నామని, పెన్షన్, ఇంటి అద్దెలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదన్నారు.
Advertisement