సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లోని సీఎం నివాసంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తొలిసారిగా ప్రగతి భవన్‌కు రావటం, సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది.
ఉదయం నుంచి సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులతో ప్రగతి భవన్‌లో సందడి నెలకొంది. ఈ సందడి ముగిశాక సాయంత్రం 7 గంటల సమయంలో పవన్ ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో సీఎం ప్రగతి భవన్‌లో లేరు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. దీంతో అరగంట సేపు పవన్ నిరీక్షించారు. రాజ్‌భవన్ నుంచి వచ్చీరాగానే పవన్‌తో సీఎం సమావేశమయ్యారు.
ప్రభుత్వ పథకాలకు కితాబు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గొప్పగా ఉన్నాయని పవన్ కితాబిచ్చారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, వ్యవసాయానికి రూ.8 వేల సాగు పెట్టుబడి అందించే పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి దిశగా చేపట్టే కార్యక్రమాలు జనరంజకంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. కొద్ది రోజుల కిందటే రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గవర్నర్ ఇచ్చిన ఆతిథ్య విందులో కేసీఆర్‌ను పవన్ కలిసి కాసేపు ప్రత్యేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ప్రత్యేకంగా కలుస్తానంటూ పవన్ సీఎం అపాయింట్‌మెంట్ కోరగా.. ఎప్పుడైనా రావొచ్చని సీఎం ఆహ్వానించినట్లు సమాచారం. నంద్యాల ఉపఎన్నిక సమయంలో పవన్ పార్టీకి ఒక్క శాతం ఓట్లు కూడా రావంటూ కేసీఆర్ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించలేదు. ప్రపంచ తెలుగు మహాసభలకు సినీ నటులందరికీ పంపినట్లే పవన్‌కు కూడా ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
అయితే పవన్ ఈ సభలకు హాజరు కాలేదు. కానీ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించారని, ఏటా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్రపతి విందు సందర్భంగానే పవన్ కేసీఆర్‌కు అభినందనలు తెలిపినట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలోనే సీఎం, పవన్ మరోసారి భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment