
రైతుల జీవితాలతో కేసీఆర్ ఆటలు
పీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీకి మూడోవిడత నిధులను విడుదల చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని పీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు నుంచి ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఇచ్చినట్లు ఒకసారి, 791 కోట్లు విడుదల చేసినట్టు మరోసారి ప్రకటన చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 1,791 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దేనికోసం ఖర్చు చేసిందని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీని ఆగం చేసిన కేసీఆర్: మల్లు రవి
పేదలకు వైద్యంకోసం ఎంతో భరోసాగా ఉన్న ఆరోగ్యశ్రీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగం చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. పుష్కరాలకు, పండుగలకు, పబ్బాలకు, గుళ్లకు, వ్యక్తిగత అవసరాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పేదల వైద్యానికి 300 కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నదని విమర్శించారు. ఆరోగ్యశ్రీని నీరుగారిస్తే పెద్ద ఎత్తున పోరాడుతామన్నారు.