పెద్ద కేసా.. పెండింగే..
- పాత కేసులపైనే సీఐడీ సమీక్షలు
- కీలక కేసులపై ఉదాసీనత
- పెండింగ్‌లో 1,350 కేసులు
- అధికారుల కొరత అంటున్న సీఐడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖకు సీఐడీ విభాగం కీలకమైనది. ఎన్నో సంచలన కేసులు విచారించింది. ప్రభుత్వానికి ఏసీబీ ఓ చేతిలాంటిదైతే.. సీఐడీ మరో చేయి. అలాంటి సీఐడీ ఇప్పుడు నీరసపడింది. గడిచిన మూడేళ్లలో సంచలన కేసుల దర్యాప్తు ప్రారంభించిన ఈ విభాగం.. వాటిని తుదిదశకు చేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల నాటి కేసులపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్న ఆ శాఖాధికారులు, కీలక కేసులపై మాత్రం ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. పాత కేసుల బూజు దులపడం అవసరమే అయినా కీలక కేసులను పెండింగ్‌లో పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఏళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలే..
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఐడీకి 1,350 పెండింగ్ కేసులు కేటాయించారు. వీటిలో ఎక్కువగా ఆర్థిక నేరాలున్నాయి. ఈ కేసుల్లో పలు విభాగాలకు ఏళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప దర్యాప్తులో సాధించిన పురోగతి లేదు. పెండింగ్ కేసులపై వివరణ కోరగా సీఐడీలో తీవ్రమైన అధికారుల కొరత ఉందని, అందుకే దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు.
‘ఇళ్ల పథకం’ కేసు మూడేళ్లుగా..
గృహ నిర్మాణ శాఖలో భారీ అవినీతి జరిగిందని ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో సీఐడీ విచారణ ప్రారంభించింది. మూడేళ్లు గడిచినా ఒక్క వ్యక్తిని గానీ, అధికారిని గానీ అరెస్టు కాదు కదా.. అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన దాఖలాల్లేవు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) నిధుల్లో భారీగా పక్కదారి పట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. 2014 నవంబర్‌లో పట్టాలెక్కిన కేసు దర్యాప్తు ఇంకా తుదిదశకు చేరలేదు. ఇక ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీలో బ్రోకర్లు, సూత్రధా రులను అరెస్టు చేసిన సీఐడీ.. కేసులో అధికారుల పాత్రపై పూర్తి విచారణ చేయలేకపోయింది.
బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో చిన్న చిన్న చేపలను వలవేసి పట్టిన సీఐడీ అధికారులు.. అసలు నిందితులను వదిలేశారని ఆరోపణలున్నాయి. ప్రధాన నిందితుడు శివరాజుతో కలసి లబ్ధి పొందిన డీలర్లు, రైస్ మిల్లర్లు, ఇతరత్రా ప్రముఖులను సీఐడీ విచారించలేకపోయిందని, ఇందుకు పై స్థాయి నుంచి ఒత్తిళ్లున్నాయన్న వార్తలు వినిపించాయి. ఇలా కీలక కేసుల్లో దర్యాప్తుపై కనీసం చార్జిషీట్‌కు కూడా వెళ్లలేని దుస్థితిలో సీఐడీ ఉందని ప్రచారం సాగుతోంది.