
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్‌లో డీజిల్ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకుంది. పెట్రోల్ కూడా దానిని అనుసరిస్తూ భగ్గుమంటోంది. రోజు వారీ ధరల సవరణ పేరిట పెట్రో ధరలను పైసా.. పైసా పెంచుతున్న చమురు సంస్థలు.. వినియోగదారునిపై సైలెంట్‌గా బాదేస్తున్నాయి.
ఈ నెల మొదట్లో డీజిల్ ధరను లీటర్‌కు మూడు నుంచి 19 పైసల చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు.. రెండు రోజుల క్రితం మూడు పైసలు తగ్గించాయి. మళ్లీ ఇప్పుడు డీజిల్ ధర తారస్థాయికి చేరింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.70.58కు చేరింది. ఇక లీటర్ పెట్రోల్ ధర రూ.78.27గా ఉంది.
పక్షం నుంచి రోజులకు..
గతేడాది వరకు ప్రతి పక్షం రోజులకోసారి పెట్రో ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. గత జూన్ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన తొలి పక్షం రోజులూ ధరలు తగ్గగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రోజువారీగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచొద్దని చమురు సంస్థలకు సూచనలు జారీ చేసింది. చమురు సంస్థలు మాత్రం కేంద్రం ఆదేశాలు తమకు అందలేదని చెపుతూ ధరలను పెంచుతున్నాయి.
డీజిల్ రూ.70.58.. పెట్రోల్ రూ.78.27
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీజిల్ ధర మోతెక్కుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.70.58గా ఉంది. రోజువారీ ధరల సవరణ విధానం ప్రారంభమైన సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.59.30గా ఉంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ అక్టోబర్ నాటికి రూ.64.02కి చేరింది. మార్చి నెలఖారులో రూ.69.97కు పెరిగింది.
ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.78.27గా ఉంది. గత జూన్‌లో రూ.69.56గా ఉన్న పెట్రోల్ ధర ఆ తర్వాత రోజువారీ ధర సవరణలతో పైసా పైసా పెరిగుతూ వచ్చింది. గత నెలఖారులో రూ.77.89గా ఉంటే.. ఈ నెలలో రూ.78.36 వరకు పెరిగి ఆ తర్వాత హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీల బాదుడు కూడా తోడవుతోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయి..
పన్నుల వల్ల పెట్రో ధరలు ఎగబాకుతున్నాయి. ఖజానా నింపేందుకు ప్రజలపై పన్ను రుద్దేస్తున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు దిగిరావడం ఖాయం. కేంద్రం దీనిపై పునరాలోచించాలి. – రియాజ్ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు..
కేంద్రం పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది. పెట్రో ధరలు దిగిరావాల్సిందే. లేకుంటే రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు. – జగదీశ్, ఉప్పుగూడ, హైదరాబాద్
ప్రజలను పిచ్చోళ్లను చేస్తోంది..
ఒకేసారి రూపాయల్లో పెంచితే తెలిసిపోతుందని.. రోజూ పైసల్లో పెంచుతూ అమాయక ప్రజల్ని ప్రభుత్వం పిచ్చివారిని చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వాహనాలను ఇళ్లలో నుంచి తీయాలంటేనే ప్రజలు భయపడే రోజులు వస్తాయి. – ఉదయ్, క్యాబ్ డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment