
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరుగుతున్నది పైసల్లోనే అయినా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రోజువారీ ధరల సవరణ వినియోగదారుల పాలిట శాపంగా తయారైంది. కేవలం పది రోజుల్లో లీటర్ పెట్రోల్ ధరపై 63 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగింది.
ఇప్పటికే దేశంలో డీజిల్ ధర టాప్‌గా మారగా, పెట్రోల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత జూన్ వరకు ప్రతి పక్షం రోజులకోసారి ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. ఆ తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చి న తొలి పక్షం రోజుల్లో ధరలు తగ్గగా.. తర్వాత క్రమంగా విజృంభించాయి. పెట్రో ఉత్పత్తుల ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీల ప్రభావం కనిపిస్తోంది.
రికార్డు స్థాయిలో పెట్రోల్..
ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.78.90కు చేరింది. గత నెలాఖరులో రూ.77.89గా ఉన్న ధర.. ఆ తర్వాత పైసలు పైసలు పెరుగుతూ వచ్చింది. నెల ప్రారంభంలో వరసగా మూడు రోజులపాటు 11 నుంచి 19 పైసలకు పెరిగి ఆ తర్వాత ఒక పైసా నుంచి 5 పైసల పెంపు వరకు పరిమితమైంది.
మధ్యలో మూడు రోజులు ధరలో ఎలాంటి మార్పు లేకపోగా రెండ్రోజులు మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత పైసలు పైసలు పెరుగుతూ గత మూడు రోజుల నుంచి విజృంభించింది. మరోవైపు డీజిల్ ధర టాప్‌గా మారింది. ప్రస్తుతం లీటర్ ధర రూ.71.44 పైసలు పలుకుతోంది. ధరల సవరణ సమయంలో డీజిల్ లీటర్ ధర రూ.59ç.30 పైసలు ఉండగా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. డీజిల్ ధర ఆల్‌టైం రికార్డుగా తయారైంది.
ప్రతి నిత్యం విక్రయం ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ఉత్పత్తుల విక్రయాలు అధికంగా ఉంటాయి. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వాహనాల వరకు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా వాటి ద్వారా నిత్యం 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడుపోతుంది.
ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి నిత్యం పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment