చిత్రాలు అరుదు.. రక్షణ కరువు!
చిత్రాలు అరుదు.. రక్షణ కరువు!
Published Mon, May 29 2017 2:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
- పిల్లలమర్రి ఆలయంలో కాకతీయుల కాలం నాటి అద్భుత కళ
- అవగాహన లేక పాడుచేస్తున్న దేవాలయ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సాగర మథనం.. అమృతం కోసం దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకుని పర్వతంతో చిలు కుతున్నారు.. ఇంతలో గరళం వచ్చింది.. భయంకరమై న ఆ విషం వాసనకు కొందరు రాక్షసులు కిందపడిపోయారు.. ఇలా విషపు ఘాటుకు రాక్షసులు పట్టుతప్పిన తీరు పెద్దగా ప్రచారంలో లేదు.. కానీ... ఏడొందల ఏళ్ల కిందట చిత్రించిన ఓ దృశ్యం దీన్ని ప్రత్యే కంగా తెలుపుతోంది. ఇదొక్కటే కాదు.. రామరావణ యుద్ధంలో కూడా కొన్ని అరుదైన ప్రత్యేకతలు ఆ చిత్రాల సొంతం!
ఆ చిత్రాలెక్కడున్నాయో తెలుసా..
సూర్యాపేటకు సమీపంలో ఉన్న పిల్లలమర్రి నామేశ్వరాలయం ఈ అద్భుత, పురాతన కుడ్య చిత్రాలకు వేదికగా ఉంది. ఇలా దేవాలయాల్లో కుడ్య చిత్రాలు అరుదు. పురాతన ఆల యాల్లో ఎక్కడోగాని ఇవి కనిపించవు. నాటి సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక పరిస్థితులకు ఇవి ప్రతిబింబంగా ఉంటాయి. నాటి పరిస్థితులను అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి. తెలంగాణలో ఇలా కుడ్య చిత్రాలున్న దేవాలయాలు రెండు చోట్ల మాత్రమే ఉన్నాయని పురావస్తు శాఖ పేర్కొంటోంది. అంత అరుదైన ఈ చిత్రాలు ఇప్పుడు దేవాదాయ శాఖ నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే మూడొంతుల చిత్రాలు ధ్వంస మయ్యాయి. పురావస్తుశాఖృదేవాదాయ శాఖ మధ్య సమన్వయం లేకపోవటంతో ఈ చిత్రాలు అదృశ్యమయ్యే దుస్థితికి చేరుకున్నాయి.
కాకతీయుల కాలంలో...
పిల్లలమర్రిలో కాకతీయులు త్రికూటాలయాన్ని నిర్మించారు. ఈ శివాలయం కొద్దికాలానికే మహ్మదీయ రాజుల దండ యాత్రలో కొంత ధ్వంసం కాగా.. 14వ శతాబ్ద కాలంలో పున ర్నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సమ యంలో ఆలయం ముఖ మంటపం రాతి దూలాలపై ఇతిహాసగా«థలను చిత్రాల రూపంలో సంక్షిప్తం చేశారు. ఈ కుడ్య చిత్రాలను సహజ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. 10 నుంచి 12 అడుగుల పొడవున్న ఈ దూలాలపై అంతే పొడవుతో వీటిని చిత్రించారు. కాలక్రమంలో ఇవి పూర్తిగా మసకబారిపోవటంతో పదేళ్ల క్రితం పురావస్తు శాఖ కెమికల్ ట్రీట్‌మెంట్ నిర్వహించి మళ్లీ వెలుగులోకి తెచ్చింది. కానీ పరిరక్షణను మాత్రం గాలికొది లేశారు. ఆలయాన్ని నిర్వహించే దేవాదాయశాఖ సిబ్బందికి వీటిపై అవగాహన కూడా లేకపోవటంతో అవి ధ్వంసమ య్యాయి. ఆలయ గోడలకు ఇష్టారీతిలో లైట్లు, స్విచ్ బోర్డులు, వైర్లు ఏర్పాటు చేశారు. అందుకు ఎడాపెడా మేకు లు, కొయ్యలు ఏర్పాటు చేశారు. వైర్లు రాసుకుపోవటంతో చిత్రాలు ధ్వంసమయ్యాయి.
ఇప్పటికైనా పరిరక్షించాలి..
పిల్లలమర్రి ఆలయంలో ఇటీవల ఈ చిత్రాలపై అధ్యయనానికి వచ్చిన ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత అధ్యాపకు రాలు మైనేని కృష్ణకుమారి.. వాటిని చూసి అబ్బురపడ్డారు. అవి చాలా అరుదని గుర్తించి తాజాగా తాను రాసిన పుస్తకంలో వివరాలు నిక్షిప్తం చేశారు. భావి తరాలకు అందే వీలు లేకుండా ఈ చిత్రాలను నాశనం చేస్తున్నారని ఆమె ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఆ చిత్రాలను వెంటనే పరిరక్షించాలని కోరారు. తెలంగాణ జాగృతికి చెందిన శ్రీరామోజు హర గోపాల్ కూడా ఇటీవల వాటిని పరిశీలించి చిత్రాలను ఫొటోల రూపంలో పదిలపరిచే పని ప్రారంభించారు.
Advertisement
Advertisement