- పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశాల్లేవు
- కొనసాగనున్న తెలంగాణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం మహానాడును పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును మరోసారి ఎన్నుకోవటం వరకే పరిమితం చేయనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశాలు లేవని సమాచారం. వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్రం రెండుగా విడిపోనుంది. దీంతో రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల ను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఈ మహానాడులో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను ఎన్నుకోకుండా పార్టీ అధ్యక్షుడి గా చంద్రబాబును మాత్రమే ఎన్నుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి సాధారణ ఎన్నికల సమయంలో ఒక కమిటీని నియమించారు. ప్రస్తుతానికి ఆ కమిటీనే యధాతథంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారంగా ఉంది.
బాబుతో బాలకృష్ణ భేటీ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కింగ్‌షుక్ నాగ్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాల కొండయ్య, పూనంమాలకొండయ్య తదితరులు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నటి జమున, నటుడు జయప్రకాశ్‌రెడ్డి కూడా బాబుకు అభినందనలు తెలిపారు.
మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కువైట్ ప్రవాసాంధ్ర టీడీపీ గౌరవాధ్యక్షుడు వెంకట్, అధ్యక్షుడు సుబ్బారాయుడు నాయుడు, ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు గోపరాజు వెంకటేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపినవారిలో ఉన్నారు. ఇలావుండగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కేక్ కట్ చేశారు. గుంటూరు రైల్‌పేటకు చెందిన ఒక మహిళ సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి తన వంతు విరాళంగా పదివేలు చంద్రబాబుకు పోస్టు ద్వారా పంపారని మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీరాజ్ చాంబర్ రాష్ట్ర కమిటీ సమావే శాలు ఈ నెల 25, 26 తేదీల్లో తిరుపతిలో జరుగుతాయని టీడీపీ అధికార ప్రతినిధి, చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ వేరొక ప్రకటనలో తెలిపారు.
టీడీపీలో చేరిన పిఠాపురం ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వర్మకు బాబు టీడీపీ టిక్కెట్టు నిరాకరించటంతో ఆయన రెబల్‌గా పోటీచేసి గెలుపొందారు. పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అధ్యక్షుడి ఎన్నికకే మహానాడు పరిమితం!
Published Fri, May 23 2014 2:11 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement