ప్రణాళిక వ్యయం.. రూ.62 వేల కోట్లు!
♦ శాఖల వారీగా నేడు కేటాయింపులు
♦ తుది దశకు చేరుకున్న బడ్జెట్ కసరత్తు
♦ పలు శాఖలకు ముందుగానే వెల్లడి కానున్న వ్యయాలు
♦ కొత్త తరహా బడ్జెట్ కూర్పుపై అధికారుల్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.62 వేల కోట్లు కేటాయించే అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ప్రణాళిక వ్యయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా ప్రాథమిక కసరత్తు పూర్తి చేశాయి. శనివారం సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ తయారీలో కొత్త పంథాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయిస్తారో సోమవారం వెల్లడిస్తారు.
ఇప్పటికే అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు సమర్పించాయి. వీటి ఆధారంగా ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలనే అంశంపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. సీఎం ప్రకటించిన కొత్త విధానంతో బడ్జెట్ తయారీ మరింత వేగం పుంజుకుంది. ఏటా బడ్జెట్ సమయం వరకు రహస్యంగా ఉండే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు అన్ని శాఖలకు ముందుగానే వెల్లడి కానున్నాయి. మునుపెన్నడూ ఇలాంటి విధానం లేకపోవడంతో బడ్జెట్‌పై అన్ని శాఖల అధికారులు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండో దశలో తమకు కేటాయించే నిధులను ఏయే పథకానికి ఖర్చు చేస్తారో జిల్లాల వారీగా కసరత్తు చేసి ఆయా శాఖలు నివేదిక సమర్పించాలి. అన్ని జిల్లాల ప్రణాళికలను క్రోడీకరించి ‘జిల్లా అభివృద్ధి కార్డులు’ తయారు చేస్తారు.
ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ పెరుగుదల..
ప్రస్తుతం పెరిగిన ఆదాయంతో పాటు వచ్చే ఏడాది వచ్చే ఆదాయ వనరులు అంచనా వేసుకుని ప్రణాళిక వ్యయాన్ని నిర్దేశిస్తారు. పన్నుల, పన్నేతర ఆదాయం మొత్తం పరిగణనలోకి తీసుకుంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం 15 శాతం వృద్ధి చెందింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాలన్నీ కలిపితే దాదాపు అదే మొత్తంలో ప్రణాళిక వ్యయం పెరుగుతుందని అంచనా. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1.15 లక్షల కోట్లతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ.52,383 కోట్లు. ఆదాయ వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఏడాది ఈ ప్రణాళిక వ్యయం సుమారు రూ.60 వేల కోట్లకు చేరుతుంది.
ప్రణాళికేతర వ్యయం తగ్గించి, ప్రణాళిక వ్యయం పెంచాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో మరో రూ.2 వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. దీంతో ప్రణాళిక వ్యయం దాదాపు రూ.62 వేల కోట్లకు చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, రూ.25 వేల కోట్లు సాగు నీటిపారుదల శాఖకు కేటాయించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది రైతు రుణ మాఫీకి రూ.4,250 కోట్లు కేటాయించటం తప్పనిసరి. మిగిలిన దాదాపు రూ.33 వేల కోట్లలో ఏయే శాఖకు ఎంత చొప్పున కేటాయిస్తారు.. ఏయే పథకాలకు ఎక్కువ నిధులు ఖర్చు చేస్తుంది.. తదితర అంశాలపై సోమవారం స్పష్టత రానుంది.