
మొక్కలు పెంచకుంటే భవిష్యత్‌లో నష్టం: గవర్నర్
రాజ్‌భవన్‌లో హరితహారంలో పాల్గొన్న నరసింహన్ దంపతులు
హైదరాబాద్ : మానవుడి మనుగడకు ప్రాణాధారమైన మొక్కలు, చెట్లను విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలని.. లేకుంటే భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం రాజ్‌భవన్ ప్రాంగణంలో నిర్వహించిన హరితహారంలో తన సతీమణి విమలా నర్సింహన్‌తో కలసి ఆయన మొక్కలు నాటారు.
ముంచుకొస్తున్న గ్లోబల్ వార్మింగ్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మొక్కలు పెంచడం మినహా మరో మార్గం లేదని, ప్రతి ఒక్కరు శుభకార్యాల్లో ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, సలహాదారులు ఏకే మొహంతి, ఏపీవీఎన్ శర్మ, జాయింట్ సెక్రటరి బసంత్‌కుమార్, పలువురు సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.