గో సంరక్షణతో రైతు ఆత్మహత్యల నివారణ
దయచేసి గోవధ చేయవద్దు
గో రక్షా దివస్‌లో పరిపూర్ణానంద స్వామి
హైదరాబాద్: గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రొత్సహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని, ఆ వైపుగా ప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులకు గోవులను పంపిణీ చేసేలా గో క్రాంతి పథకాన్ని (గతంలో పశు క్రాంతి పథకం లాగా) ప్రవేశపెట్టాలని కోరారు. గో రక్షా దివస్‌ను పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్ గోశాలలో గురువారం గోపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల నివారణకు రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ సరిపోవడం లేదన్నారు.
గోవుల పెంపకం, పశు సంపద, పాడి తదితర అంశాలపై ప్రభుత్వాలు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. గో రక్షణకు సంబంధించి డా.బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. భారత భూమిలో దయచేసి గోవధ చేయొద్దని కోరారు.
గో రక్షా దివస్‌గా ప్రకటించాలి
ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తేదీన గో రక్షా దివస్‌గా ఏపీ ప్రభుత్వం ప్రకటించినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించాలని కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ చింతల రామచంద్రా రెడ్ది మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పండితుల మహాసభలో 10వ తేదీన గోమాతకు పూజలు చేయాలని నిర్ణయించినట్లు, ఆ ప్రకారమే గో రక్షా పూజ నిర్వహించినట్లు తెలిపారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రకాశ్ రావు గోశాల ట్రస్టు చైర్మన్ కమల్ నారాయణ అగర్వాల్‌కు రూ. 25 వేలను విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.