సాక్షి, హైదరాబాద్: రాజకీయలబ్ధి కోసం సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ ను మళ్ళీ తెరపైకి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. మళ్లీ తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు.
విభజన హామీలపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చింతల చెప్పారు. గురువారం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ తెలంగాణ–ఆంధ్రా అంటూ నినాదాలు ముందుకు తీసుకురావడాన్ని రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ తమదని, ఏపీ, తెలంగాణలలో అధికారంలో లేకున్నా కేంద్రం సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందని, నోటీసులు కేవలం సినిమా టైటిల్స్ మాత్రమేనని బీజేపీనేత, విశ్రాంత ఐఏఎస్ చంద్రవదన్ చెప్పారు. ప్రధాన సినిమా మొదలైతే కేసు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు. గతంలో ఎక్సైజ్ కమిషనర్ పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని, ఈ కేసు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment