రైతుల అయిష్టత వల్లే నిజాం షుగర్స్ తెరవలేదు
• వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్య
• జిల్లా వ్యవసాయాధికారులు, ఏడీఏలతో రబీ సన్నద్ధ సమావేశం
• సొసైటీల ద్వారా రబీకి ఎరువులు, విత్తనాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవకపోవడానికి రైతుల అయిష్టతే కారణమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజాం ఫ్యాక్టరీని మరమ్మతు చేసి తెరవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నా ఫ్యాక్టరీ పరిధిలోని మెట్‌పల్లి, మెదక్, శక్కర్‌పల్లి రైతులు ముందుకు రాలేదని, అందుకే అది వెనకడుగు పడిందని అన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా అన్ని జిల్లాల వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, ఏడీఏలతో రబీ సన్నద్ధతపై శుక్రవారం మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి చేస్తున్న యాత్ర వృథా ప్రయాస అని అన్నారు.
తొలిసారిగా సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ వర్షాలతో దెబ్బతిన్న సోయాబీన్‌ను కొనుగోలు చేయడానికి ఏడు ఫ్యాక్టరీలకు బాధ్యత అప్పగించామని, ఆ ఏడింటికి ఏడు జిల్లాలు అప్పగించామని చెప్పారు. ఏ గ్రేడ్‌కు రూ.2,775 చొప్పున కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభిస్తున్నామని, కనీస మద్దతుధర లభించేలా చూస్తామని అన్నారు. నాబార్డు నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం త్వరలో వస్తుందని, దాంతో రాష్ట్రంలో రైతులకు విరివిగా బిందుసేద్యం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇవ్వాల్సిన రుణమాఫీ సొమ్ములో మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఈసారి గణనీయంగా పప్పుధాన్యాల దిగుబడులు వస్తాయని చెప్పారు.
రబీకి అవసరమైన వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర, వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని, అన్ని విత్తనాలను కూడా ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. 12.35 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లక్ష్యానికిగాను ఇప్పుడు తమ వద్ద 8.05 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలు వచ్చే అవకాశమున్నందున రబీ పంట కోతలను వచ్చే మార్చి 31 నాటికి పూర్తి చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
నకిలీ మిరప విత్తనాలు విక్రయించిన 98 మంది డీలర్ల లెసైన్సులు రద్దు చేశామని, ఐదుగురిపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టామని చెప్పారు. తనను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్‌నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, ఆయన గృహనిర్మాణమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలకు ఎన్నిసార్లు బర్తరఫ్ చేయాల్సి ఉంటుందోనని ఎద్దేవా చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి, కమిషనర్ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.