దొరికిన ‘ముత్తూట్’ దొంగలు
- ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- 3.5 కిలోల బంగారం, ఐదు లక్షల నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ముత్తూట్ దొంగలు దొరికారు. డిసెంబర్ 28న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. దోపిడీకి మాస్టర్ మైండ్‌గా పనిచేసిన లక్ష్మణ్ నారాయణ్ ముదంగ్, పాటిల్, విజయ్‌కుమార్, సుభాష్‌లతో పాటు వారి నుంచి బంగారాన్ని కొనుగోలు చేసిన కుమార్ పాల్ త్రిలోక్‌చంద్ షాలను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదివారమిక్కడ వెల్లడించారు. వీరి నుంచి 3.5 కిలోల బంగారం, ఐదు లక్షల నగదు, స్కార్పియో, డాట్‌సన్ వాహనాలు, బజాజ్ అవేంజర్ బైక్, దేశవాళీ తుపాకీ, పగిడి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
దోపిడీలో పాలుపంచుకున్నవారిలో కొందరికి ఛోటా రాజన్, రవి పూజారా, డబ్బుశేషు గ్యాంగులతో సంబంధం ఉందని వెల్లడిం చారు. ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబధం ఉన్న సుందర్, తుకారాం, రోషణ్ యాదవ్, ట్వింకిల్ మిశ్రా, కాలా కోసం గాలిస్తున్నట్లు వివరించారు. వీరికి 2015లో కేపీహెచ్‌బీ, బీరంగూడలో జరిగిన ముత్తూట్ దోపిడీ కేసులతో కూడా సంబంధమున్నట్టుగా గుర్తించామన్నారు. సుందర్, పాటిల్‌లు పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.6 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు.
కారు కోసం వచ్చి చిక్కారు..
దోపిడీ కోసం ఉపయోగించిన నల్ల స్కార్పియో కారును కర్ణాటక కాల్‌బుర్గిలోని హలకట్టలో విజయ్‌కుమార్ ఇంటి వద్ద ఉంచారు. దాన్ని తీసుకు వెళ్లేందుకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వీరంతా ఓ కారులో వచ్చారు. తిరుగుప్రయాణంలో కారు ముందు బజాజ్ అవేంజర్ మోటార్ సైకిల్‌పై విజయ్ కుమార్ వెళ్తుండగా కొడంగల్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన స్కార్పియోను డ్రైవ్ చేస్తున్న పాటిల్‌ను, మరో వాహనంలో వస్తున్న పాటిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను విచారించగా ముత్తూట్ దోపిడీ తమ పనేనని ఒప్పుకున్నారు.
ముంబైలోని జావేరి బజార్‌లో జ్యువెల్లరీ షాప్ నిర్వహిస్తున్న కుమార్ పాల్ త్రిలోక్‌చంద్ షాకు బంగారం అమ్ముతామని వెల్లడించారు. ఇదే సమయంలో సుభాష్ తన వాటా డబ్బుల కోసం ముంబైలోని షాను కలిసేందుకు మధురై, బెంగళూరు మీదుగా ముంబైకి చేరుకున్నాడు. వాడీ బస్టాండ్‌కు చేరుకొని ల్యాండ్ లైన్ నంబర్ నుంచి షాకు ఫోన్‌కాల్ చేశాడు. తర్వాత వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. దోపిడీకి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్ మహారాష్ట్రలోని వాడీకి చెందినవారు. ఈయనకు సుభాష్ పాటిల్, రోషణ్ యాదవ్, ట్వింకిల్ మిశ్రా తోడయ్యారు. వీరు నలుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి దోపిడీలు మొదలెట్టారు.
ఆ బైక్ పట్టించింది..
దోపిడీ జరిగిన రోజున మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న నల్ల స్కార్పియో కారు శంకర్‌పల్లి రోడ్డు మీదుగా వెళ్లింది. అదే వాహనం 8.57 గంటల సమయంలో పటాన్ చెరు మీదుగా ఆర్‌సీపురానికి ఏపీ నంబర్ ప్లేట్‌తో వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసు లు సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేయగా ఆ స్కార్పియో కారు ముందు బజార్ అవేంజర్ బైక్ పైలటింగ్ చేస్తూ కనిపించింది. ఈ వాహనం వికారాబాద్, పరిగి, కొడంగల్, రిబ్బన్‌పల్లి, సేడమ్ నుంచి చిత్తాపూర్ చేరుకుంది. బజార్ అవేంజర్ వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించగా అది గుల్బార్గాలోని కాల్‌బుర్గిలోని హలకట్ట గ్రామంలోని విజయ్‌కుమార్ (మహబూబ్ నగర్‌వాసి) పేరుతో ఉండటంతో కేసులో నిందితులను పట్టుకోగలిగారు. బంగారం అంతా షాకు అమ్మి ఉంటారని అనుమానిస్తు న్నారు. త్వరలోనే అంతా బంగారం అంతా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.