సాక్షి, సిటీబ్యూరో: నయాసాల్ వేడుకల నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం సరికొత్త వ్యూహం రచించింది. డిసెంబర్ 31న రాత్రి డ్రంకన్ డ్రైవింగ్‌కు చెక్‌పెట్టి ప్రమాద రహితంగా చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఆరోజు రాత్రంతా తనిఖీలు చేయనున్నట్టు ట్రాఫిక్ విభాగం డీసీపీ ఏవీ రంగనాథ్ మంగళవారం వెల్లడించారు. సాధారణ రోజుల్లో ఈ తనిఖీలు రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు మాత్రమే సాగుతాయి. అయితే డిసెంబర్ 31న దృష్టిలో పెట్టుకుని డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలను ఆదివారం 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు దాదాపు ప్రతి వారాంతంలోనూ ఈ తనిఖీలు చేపడుతున్నారు. అయితే సాధారణ రోజుల్లో ట్రాఫిక్ ఠాణాల వారీగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే ట్రాఫిక్ టీమ్స్ తనిఖీలు చేస్తాయి.
ఆదివారం మాత్రం ఒకే చోట పనిచేసే స్టాటిక్ బృందాలతో పాటు నగర వ్యాప్తంగా సంచరిస్తూ అవసరమైన చోట ఆకస్మిక తనిఖీలు చేయడానికి అనువుగా మొబైల్ టీమ్స్, వాహన చోదకుల్లో కలిసి సంచరిస్తూ, డ్రైవింగ్ చేస్తున్న మందుబాబులను పట్టుకోవడానికి ‘డెకాయ్ టీమ్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తమ్మీద నగర వ్యాప్తంగా 100 బృందాలు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు డీసీపీ తెలిపారు. ఇవి ప్రధానంగా నగర శివార్ల నుంచి నగరంలోకి దారితీసే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి. ఇప్పటి వరకు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు కేవలం ప్రధాన రహదారులకే పరిమితమయ్యాయి. డిసెంబర్ 31 రాత్రి మాత్రం గల్లీల పైనా దృష్టి పెడుతున్నామని, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు మోహరిస్తామని రంగనాథ్ తెలిపారు. ఎవరైనా మద్యం తాగిన స్థితిలో వాహనాలు నడుపుతూ చిక్కితే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు తక్షణం
వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకుంటారు. సేఫ్ న్యూ ఇయర్ వేడుకలే తమ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ‘‘ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన మందుబాబుల సంఖ్య 2015లో 2,500, 2016లో 7,500గా ఉంది. ఈ ఏడాది అది 9 వేలకు పెరిగినట్టు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఒకరోజు నుంచి 15 రోజుల వరకు జైలుకు వెళ్లిన మందుబాబుల డేటాను ఆధార్ ఆధారంగా నమోదు చేసి డేటాబేస్‌లో పొందుపరుస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తలో జాబ్ వెరిఫికేషన్, వీసా, పాస్‌పోర్ట్ జారీల్లో ఇబ్బందులు ఎదురవుతాయని డీసీపీ రంగనాథ్ తెలిపారు’’
Comments
Please login to add a commentAdd a comment