మాయగాడి వలలో పడబోయిన ఇద్దరు అమ్మాయిలను కాపాడి మారేడుపల్లి పోలీసులు శెభాష్ అనిపించుకున్నారు. ఎస్.ఐ రవికుమార్ కథనం ప్రకారం...
మాయగాడి నుంచి ఇద్దరు అమ్మాయిలను రక్షించిన పోలీసులు
మారేడుపల్లి: మాయగాడి వలలో పడబోయిన ఇద్దరు అమ్మాయిలను కాపాడి మారేడుపల్లి పోలీసులు శెభాష్ అనిపించుకున్నారు. ఎస్.ఐ రవికుమార్ కథనం ప్రకారం... మెదక్ జిల్లా లోతట్ట గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు (16,17 ఏళ్లు) పేదకుటుంబానికి చెందిన వారు. నగరంలో ఉద్యోగం చేసుకుని జీవిద్దామని ఈనెల 27న సికింద్రాబాద్‌కు వచ్చారు. రెండ్రోజుల పాటు జేబీఎస్ పరిసరాల్లో తలదాచుకుని తమ గ్రామానికి తిరిగి వెళ్లారు. మళ్లీ ఈనెల 3న జేబీఎస్‌కు చేరుకున్న వారు అమాయకం అటూ, ఇటూ తిరుగుతుండగా జేబీఎస్ ప్రాంగణంలో కూల్‌డ్రింక్స్ అమ్ముతున్న ప్రశాంత్(30) గమనించాడు.
ఉద్యోగాలు ఇప్పిస్తాన ని నమ్మబలికాడు. వారిని ఆ రోజు రాత్రి జేబీఎస్ సమీపంలోని ఎగ్జిబిషన్ మైదానానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తుండగా డ్యూటీలో ఉన్న పోలీసులు గమనించి ప్రశాంత్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసి అమ్మాయిలను బుధవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సమయానికి స్పందించి ఇద్దరు అమ్మాయిల జీవితాలను కాపాడినందుకు స్థానికులు పోలీసుల మెచ్చుకున్నారు. అమ్మాయిలు ఈ విధంగా ఏమి తెలియకుండా ఉద్యోగాల కోసమని నగరానికి వచ్చి, మాయగాళ్ల వలలో పడొద్దని ఎస్‌ఐ రవికుమార్ సూచించారు.