
51 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్ క్రైం: బాలకార్మికుల విముక్తి కోసం పోలీసుల తనిఖీలు రెండో రోజూ కొనసాగాయి. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు 51 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వీరిలో కొంత మంది పిల్లలు నగరానికి చెందిన వారుగా గుర్తించి వాతల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను రామాంతపూర్‌లోని ప్రగతినగర్ రెస్య్కూ హోంకు తరలించారు. శుక్రవారం జరిపిన దాడుల్లో రెయిన్‌బజార్‌లో 10మంది, కాలాపత్తర్‌లో 25మంది, డబీర్‌పూరలో 8మంది, మీర్‌చౌక్‌లో 8మంది బాలకార్మికులను గుర్తించి పోలీసులు వారికి విముక్తి కల్పించారు. కాగా, గురువారం జరిపిన దాడుల్లో చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 80 మంది పిల్లలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ నాయకత్వం వహించారు.