హైదరాబాద్: నగరంతో పాటు, పరిసర ప్రాంతాల్లోని పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు. కొంతమంది నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరిగే వారి ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా నేరస్థుల డేటాను సేకరించి ఒక చోట భద్రపరిచేందుకు కొత్త యూనిట్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి సెంట్రల్ క్రిమినల్ డేటా కలెక్షన్ సెంటర్ (సీసీడీసీసీ) ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇక నుంచి పోలీసు విచారణలో భాగంగా నమోదైన నేరగాళ్ల రికార్డును ఒక చోటకు చేర్చి సీసీడీసీసీలో ఉంచుతారు.
దీంతో నేరస్థుల ఆస్తుల వివరాలతో పాటు, ఎన్ని నేరాల్లో భాగస్వామ్యం అయ్యారన్న దానిపై పోలీసులు తెలుసుకునేందుకు సులభతరం అవుతుంది. కేంద్ర పరిధిలో ఉండే ఆ డేటా యూనిట్ లో సమాచారాన్ని అవసరమైనప్పుడు సంబంధింత పోలీస్ స్టేషన్లకు అందించే అవకాశం ఉంటుంది.