దృష్టి మళ్లించడానికే జిల్లాలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: సమస్యలు, ప్రభుత్వ చేతగానితనం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జిల్లాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రజా సౌకర్యం, సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా అని ప్రశ్నించిన పొన్నం.. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, రాజకీయ ప్రయోజనం పొందడానికే జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచారన్నారు.
జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. జిల్లాల ఏర్పాటులో విపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సూచనలు స్వీకరించకపోతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలపై పునస్సమీక్షిస్తామని పొన్నం చెప్పారు.