రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించండి
- హజ్ యాత్రికులను కోరిన డిప్యూటీ సీఎం
- మక్కాకు బయలుదేరిన తొలి విమానం
సాక్షి, హైదరాబాద్ : పవిత్ర హృదయంతో రాష్ట్రాభివృద్ధి, సుఖశాంతుల కోసం మక్కాలో ప్రార్థించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హజ్ యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ క్యాంప్ వద్ద ‘హజ్ యాత్ర-2016’ను ఆయన ప్రారంభించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ వద్ద ఎయిర్ ఇండియా విమానానికి జెండా ఊపి యాత్రికులను సాగనంపారు. తొలి విమానంలో 340 మంది యాత్రికులు బయలు దేరారు. ప్రార్థనలు విజయవంతంగా ముగించుకొని సుఖ సంతోషాలతో తిరిగి రావాలని ఆకాం క్షించారు.
మక్కా మదీనా లోని కాబా వద్ద ప్రపంచంలో ఎవరికీ దక్కని అతిథి మర్యాదలు హైదరాబాదీలకు లభిస్తాయన్నారు. నిజాం ప్రభువు కాబాకు సమీపంలో రుబాత్ అతిథి గృహాన్ని నిర్మించడంతో అప్పటి నిజాం స్టేట్‌లోని తెలంగాణ రాష్ట్ర యాత్రికులను అతిథులుగా గుర్తిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హజ్ యాత్రికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం హజ్ యాత్ర కోసం రూ.3 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధమన్నారు. కార్యక్రమంలో ఆలిండియా హజ్ కమిటీ చైర్మన్ చౌదరి మహమూద్‌అలీ ఖైసర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ సలీమ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు.