కోఠిలో గర్భిణుల బైఠాయింపు
హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓపీని గురువారం సిబ్బంది ఆలస్యంగా తెరవడం రోగులను గందరగోళపరి చింది. ఆసుపత్రిని వేరే చోటుకు తరలించేందుకే ఓపీని తెరవలేదని భావించిన గర్భిణులు తమ బంధువులతో కలసి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో గర్భిణులు వైద్య పరీక్షల నిమిత్తం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన ఓపీ ఎంతకీ తెరవకపోవడంతో చికిత్సకు వచ్చినవారు కలవరపడ్డారు.
అక్కడి నుంచి ప్రసూతి ఆసుపత్రిని తరలించారని ఇక వైద్యసేవలు అందవని కొందరు చెప్పడంతో వందలాది మంది రోగులు ఆగ్రహంతో కోఠి ఉమెన్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించారు. దీంతో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా నుండి ఇసామియాబజార్, చాదర్‌ఘాట్, ఇటువైపు సుల్తాన్‌బజార్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌చౌరస్తా, బ్యాంక్‌స్ట్రీట్, ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు. ఆసుపత్రి వర్గాలు కూడా అప్రమత్తమై ఓపీని తొమ్మిది గంటలకు తెరవడంతో పరిస్థితి సద్దుమణిగింది. రోగులు, ఆసుపత్రి సిబ్బంది మధ్య సమాచారం కొరవడడం వల్లే గందరగోళానికి దారితీసినట్లు తెలుస్తోంది.