‘బ్రహ్మకుమారీస్’ సేవలు అభినందనీయం: ప్రణబ్
హైదరాబాద్: గత 80 ఏళ్లుగా బ్రహ్మకుమారీస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇఫ్లూ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి బ్రహ్మకుమారీస్ సంస్థ భవనంలోకి వెళ్లి.. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రణబ్ మాట్లాడుతూ... భారతీయ ప్రాచీన జ్ఞాన, యోగా, ఆధ్యాత్మిక విలువలను సమాజానికి బ్రహ్మకుమారీస్ సంస్థ అందించడం సంతోషదాయక మన్నారు.
బ్రహ్మకుమారీస్ సమాజం సేవలో 80 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినంద నీయమన్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్, గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బ్రహ్మకుమారీస్ సంస్థ అడిషనల్ సెక్రటరీ జనరల్ బ్రిజ్‌మోహన్, ఢిల్లీ నేషనల్ కో–ఆర్డినేటర్ ఆశాదీదీ, శాంతిసరోవర్ డైరెక్టర్ కుల్‌దీప్‌బెహన్ తదితరులు పాల్గొన్నారు.