
జైలు వార్డర్‌పై ఉగ్రవాద ఖైదీల దాడి
చంచల్‌గూడ జైలులో వార్డర్‌పై ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు శనివారం మధ్యాహ్నం దాడి చేశారు.
సాక్షి, హైదరాబాద్ : చంచల్‌గూడ జైలులో వార్డర్‌పై ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు శనివారం మధ్యాహ్నం దాడి చేశారు. మొహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, ఇల్లియాస్ యజ్దానీ, మహ్మద్ అతాఉల్లాహ్ రహమాన్ అలియాస్ గౌస్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. తమ బంధువులతో ములాఖత్ సమయంలో ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇతర నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు వికెట్ గేటు(రెండో మెయిన్ గేటు)ను వార్డర్ భరత్‌కుమార్ తెరిచారు.
ఆ సమయంలో ములాఖత్ కోరిన తమ వారి కోసం వేచి ఉన్న హై సెక్యూరిటీ కలిగిన ఈ ముగ్గురు ఖైదీలు ఇదే అదనుగా వార్డర్‌ను తోసుకుని మెయిన్ గేటు వైపు వెళ్లారు. బిగ్గరగా అరుస్తూ జైలు సిబ్బందిని, అధికారులను పరుష పదజాలంతో దూషించడమేగాక మరో వార్డర్ సంపత్‌ను కంటి దగ్గర గాయపరిచారు. ఇతర సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై డబీర్‌పురా పోలీసు స్టేషన్‌లో జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.