సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య సీట్ల అడ్మిషన్లలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ అక్రమాలకు పాల్పడింది. బీయూఎంఎస్ (యునానీ) సీట్ల భర్తీలో నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉన్నా 50 మంది విద్యార్థులతో ఆటలాడుకుంది. ఒక్కో సీటుకు భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా అడ్మి షన్లు ఇచ్చింది.
ఈ అడ్మిషన్లు ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి వచ్చింది. కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్ణయంపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఆల్–అరీఫ్ యునానీ కళాశాలలో ఈ వ్యవహారం జరిగింది. కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2017–18 విద్యా సంవత్సరం వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీ అనంతరం 2017 సెప్టెంబర్‌లో ఆయుర్వేదిక్, హోమియోపతి, యునానీ, నేచురోపతి, యోగా కోర్సుల భర్తీని వర్సిటీ చేపట్టింది.
అన్ని కోర్సుల్లో చేరేందుకు కచ్చితంగా నీట్ అర్హత సాధించి ఉండాలని పేర్కొంది. మొదట ప్రతి కాలేజీలోని 50 శాతం సీట్ల (ఏ–కేటగిరీ)ను, అనంతరం బీ, సీ కేటగిరీ సీట్లను కన్వీనర్ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాలి. అయితే అన్ని సీట్లకు కచ్చితంగా నీట్ అర్హత ఉండాలనే నిబంధనను అల్–అరీఫ్ కాలేజీ పట్టించుకోలేదు. కాలేజీలో మొత్తం 100 యునానీ కోర్సు సీట్లు ఉండగా వాటిలో 50 సీట్లను కన్వీనర్ ఆధ్వర్యంలో భర్తీ చేసిన యాజమాన్యం... బీ కేటగిరీలోని 35, సీ కేటగిరీలోని 15 సీట్ల భర్తీలో మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.
యునానీ కోర్సుల బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజు రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంది. ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చిన విద్యార్థులకు సీట్లు ఇచ్చారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను గడువులోగా సరైన ఫార్మాట్‌లో కాళోజీ విజ్ఞాన విశ్వవిద్యాలయానికి సమర్పించాల్సి ఉండగా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. ఇప్పుడు యునానీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష జరగనుంది.
ఈ నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. కాలేజీ యాజమాన్యంలో అంతర్గత విభేదాలతో మొదటి సంవత్సరం అడ్మిషన్లపై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఫిర్యాదులు అందాయి. నీట్‌లో అర్హత సాధించకున్నా 50 మంది విద్యార్థులకు అల్–అరీఫ్ కాలేజీలో మొదటి సంవత్సరం బీయూఎంఎస్ కోర్సులో అడ్మిషన్లు ఇచ్చారని విశ్వవిద్యాలయం గుర్తించింది. దీంతో విద్యార్థుల అడ్మిషన్లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కాలేజీకి నోటీసు ఇచ్చింది.
దీనిపై కాలేజీ యాజమాన్యం సైతం తన వివరణ ఇచ్చింది. నీట్ రాయకపోయినా అడ్మిషన్లు ఇవ్వండని, దీనిపై తర్వాత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని అధికారులు హామీ ఇవ్వడం వల్లే అడ్మిషన్లు ఇచ్చామని పేర్కొంది. ఇప్పుడు ఈ అంశం కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది.
ఈసీ కమిటీలో నిర్ణయం
అల్–అరీఫ్ కాలేజీ సీట్ల విషయంపై ఫిర్యాదులు వచ్చాయి. నీట్ అర్హత లేకుండా అడ్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించాం. ఈ మేరకు కాలేజీకి నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం ఈ అంశం విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక కమిటీ (ఈసీ) పరిధిలో ఉంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం.
– బి.కరుణాకర్‌రెడ్డి, కాళోజీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్
Comments
Please login to add a commentAdd a comment