నిలోఫర్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
Published Mon, Feb 6 2017 12:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
హైదరాబాద్: నిలోఫర్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలింతల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుల బంధువులు నిలోఫర్ ఆస్పత్రి వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులకు, పోలీసులు వాగ్వాదం జరిగింది. ఆందోళన కారులు హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్‌పై దాడికి యత్నించారు.
కాగా నెల రోజుల వ్యవధిలో వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు మృతిచెందారు. ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్‌కుమార్ వైద్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, సిజేరియన్లు, మందుల్లో నాణ్యతా లోపం, ఆపరేషన్ థియేటర్‌లోని ఇన్‌ఫెక్షన్లతో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం తదితర అంశాలేమైనా బాలింతల మృతికి కారణమయ్యాయా అనేది తెలుసుకునేందుకు ఓ త్రిసభ్య కమిటీని నియమించినట్లు చెప్పారు. కమిటీలో డాక్టర్ త్రిపారాజ్ సింగ్, డాక్టర్ పద్మిని, డాక్టర్ రాణి ఉంటారన్నారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సురేష్‌కుమార్ స్పష్టం చేశారు.
Advertisement
Advertisement