
సైకో వీరంగం.. యువతికి తీవ్రగాయాలు
ఉమ్మడి రాజధాని నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఏకంగా హాస్టల్లో ఉన్న అమ్మాయిపై ఓ సైకో దాడి చేశాడు. ఈ ఘటన సంజీవరెడ్డి నగర్లో చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న సాయి లేడీస్ హాస్టల్లోకి సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ యువకుడు కత్తితో ప్రవేశించాడు. తిరుపతికి చెందిన మమత(21) ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఆమెపై అతడు దాడి చేయడంతో ఆమెకు తలపై తీవ్ర గాయాలయ్యాయి.
కాగా సైకో తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనది ఉప్పల్ అని ఓసారి, వరంగల్ అని మరోసారి చెబుతున్నాడు. పేరు అడిగితే చైతన్య అని ఓసారి, కరణ్ అని ఇంకోసారి చెప్పాడు. తాను తన అన్న బిడ్డను కలిసేందుకు వస్తే.. తనపైనే దాడి చేశారని అన్నాడు. అయితే, అతడు ఎవరో ఒక అమ్మాయిని చంపాలనే లక్ష్యంతో వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమీర్పేట, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో ఎక్కడా అసలు సెక్యూరిటీ అన్నది ఉండట్లేదు. ఈ విషయంలో పోలీసులు గతంలో జారీచేసిన నోటీసులను హాస్టళ్ల యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.