హోటళ్లపై ప్రజానిఘా
►శుచి,శుభ్రతపై ప్రజల తనిఖీ
►గ్రేటర్‌లో త్వరలో అమలు..
►లోపాలకు అంశాల వారీగా జరిమానా
సిటీబ్యూరో: మీరు హోటళ్లకు వెళ్తున్నారా.. అక్కడ శుభ్రత కానరావడం లేదా.. ‘ఈ పరిస్థితి మారదు’ అని బాధపడనక్కరలేదు. ఆహారంలో నాణ్యత లేకున్నా.. కల్తీ చేసినా చిరాకు పడనవసరంలేదు. ఇకపై ఇలాంటి వాటిపై ఆయా హోటళ్లలో మీరే తనిఖీ చేయవచ్చు. లోపాల్ని గుర్తించి ఉన్నతాధికారికి ఫిర్యాదూ చేయవచ్చు. దాదాపు నెలరోజుల పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు దాడులు చేసినప్పటికీ హోటళ్లలో కల్తీ ఆహారం.. శుచి,శుభ్రతల లేమి కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి హోటళ్లల్లో తనిఖీలకు అధికారులతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ చర్యల ద్వారా హోటళ్లలో పరిస్థితులు మెరుగు పడతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇందుకుగాను తమ హోటల్లో శుచి, శుభ్రతలు పాటిస్తున్నామని, మాంసం, ఆహార పదార్థాలు నాణ్యమైనవే వాడుతున్నామని, తమ సిబ్బందికి నిర్ణీత వ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని హోటళ్ల యాజమాన్యాలు ‘సెల్ఫ్ డిక్లరేషన్’ బోర్డును ప్రజలకు కనబడేలా ఉంచాలని ఆయా హోటళ్లను ఆదేశించనున్నారు. ఆ బోర్డులపై వారు తీసుకుంటున్న చర్యల్ని పేర్కొనాలి. వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు చేసినట్టు డాక్టర్లు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల్ని అందుబాటులో ఉంచాలి. హోటల్ ట్రేడ్ లైసెన్సును అందరికీ కనబడేలా ప్రదర్శించాలి. ఇలా కొన్ని నిబంధనల్ని కచ్చితం చేయడం ద్వారా అవి ప్రజలకు తెలుస్తాయి. ఒకవేళ అవి అమలుగాకపోతే.. బోర్డుపై నిబంధనలను చదివిన ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుగా సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారి లేదా కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ సైతం అదే బోర్డులో ఉంటుంది. ఈ విధానాలు అమలు చేయడం వల్ల ఎక్కడైనా లోటుపాట్లున్నా, కల్తీ జరిగినా ప్రజలే ముందుకొస్తారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెబుతున్నారు.
త్వరలో మొబైల్ యాప్..
నగరంలోని హోటళ్ల వివరాలతో ఓ మొబైల్ యాప్‌ను కూడా గ్రేటర్ అధికారులు రూపొందించనున్నారు. దీనిద్వారా ఫిర్యాదు అందగానే జీపీఎస్ ఆధారంగా ఆ హోటల్ ఎక్కడుందో అధికారులు గుర్తించి త్వరితంగా అక్కడకు చేరుకుంటారు. అంతేకాదు.. ఏ అధికారి ఏ హోటల్‌కు తనిఖీకి వెళ్లింది.. తదితర సమాచారం సైతం ఉన్నతాధికారుల చేతిలో అందుబాటులో ఉంటుంది. తనిఖీలకు వెళ్లి అధికారులు తమకు తోచినట్టు ఒక హోటల్‌కు తక్కువ జరిమానా, మరొక హోటల్‌కు ఎక్కువ జరిమానా విధించే అవకాశం కూడా లేదు. ఇలా జరగకుండా ఏ అంశంలో నిబంధనలు అమలు చేయకుంటే ఎంత జరిమానా విధించాలో ముందే నిర్ణయించనున్నారు. ఉదాహరణకు శుభ్రమైన తాగునీరు లేకుంటే రూ. 500 పెనాల్టీ విధిస్తారు. వంటగదికి 100 మీటర్ల లోపున డ్రైనేజీ ఉంటే పెనాల్టీకి ఒక రేటు. ఇలా ఆయా అంశాల వారీగా, జీహెచ్‌ఎంసీ యాక్ట్ మేరకు జరిమానాలు ఉంటాయి. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు ఏయే అంశాల్ని పరిశీలించిందీ.. ఎన్నింట్లో ఉల్లంఘనలున్నదీ గుర్తించి అందుకు అనుగుణంగా ఈ జరిమానాలు ఉంటాయి. ఇప్పటి వరకు పెనాల్టీలు వేసేందుకు 31 అంశాలను గుర్తించారు. ఏవైనా అంశాలు దృష్టికి వస్తే.. వాటినీ పొందుపరచాలని నిర్ణయించారు.
బోర్డుపై ఉండేవి ఇవీ..
►మా హోటల్‌లో శుచి, శుభ్రత పాటిస్తున్నాం
►శుభ్రమైన నీటిని వినియోగిస్తున్నాం
►హోటళ్ల కార్మికులకు నిర్ణీత వ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం
►వంటవారు, సిబ్బంది తలకు టోపీ, చేతులకు గ్లవ్స్ ధరిస్తూ పరిశుభ్రత పాటిస్తున్నారు
►జీహెచ్‌ఎంసీ ధ్రువీకరణ పొందిన స్లాటర్ హౌస్‌లలోని మాంసాన్నే వినియోగిస్తున్నాం
ఇలా దాదాపు పది అంశాలను హోటళ్ల యాజమాన్యాలు సెల్ఫ్ డిక్లరేషన్‌గా బోర్డులపై ప్రకటించాలి. ఏమన్నా లోటుపాట్లు ఉంటే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ అధికారి ఫోన్ నంబర్ ఉంటుంది.