ఎయిర్‌పోర్ట్ సర్వీసులు..
=నష్టాల బాటలో పయనం
=ప్రయాణికుల ఆదరణ కరువు
=ఆదాయానికి మించిన ఖర్చు
=అయినా అదే బాటలో ఆర్టీసీ
సాక్షి, సిటీబ్యూరో: ‘పుష్పక్’లు ఆపసోపాలు పడుతూనే నష్టాల బాటలో చాలా ఇష్టంగా పరుగులు తీస్తున్నాయి. తెల్ల ఏనుగుల్లా మారిన వీటిని 11 నెలలుగా ఆర్టీసీ బలవంతంగా నెట్టుకొస్తోంది. బస్సు బయటకు తీస్తే నష్టాలు.. మున్ముందు డబ్బులొస్తాయనే ఆశ లేదు.. అయినా బయటపడే ప్రయత్నం చేయట్లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరం నుంచి రవాణా సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ నడుపుతున్న ‘పుష్పక్’ బస్సులు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నా.. జీఎమ్మార్ వంటి ఓ ప్రైవేట్ సంస్థ కోసం భారీ నిర్వహణ ఖర్చును భరిస్తూ ఈ బస్సుల్ని నడపడంపై విమర్శలున్నాయి.
నగరంలో వెయ్యి రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఏ రూట్‌లోనైనా వరుసగా వారం, పది రోజుల పాటు నష్టాలొస్తే ఆ రూట్‌లో బస్సుల రద్దుకు వెనుకాడని ఆర్టీసీ ఏకంగా 11 నెలల పాటు వరుస నష్టాలతో ఎయిర్‌పోర్టుకు బస్సులు నడపడంలోని ఆంతర్యం అంతుబట్టడం లేదు. పైగా వరుస నష్టాలొస్తే ఏ క్షణంలోనైనా బస్సులను విరమించుకోవచ్చనే ఒప్పందం కూడా ఉంది. అయినా ఆర్టీసీ బయటపడకపోవడం చూస్తుంటే రెండు సంస్థల మధ్య ఏదో ‘ఒప్పందం’ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తగ్గిన బస్సులు...
గతేడాది డి సెంబర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి నగరం నుంచి నాలుగు ప్రధాన రూట్లలో 30 పుష్పక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 23 నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా, సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం మీదుగా కొన్ని బస్సులు నడుస్తున్నాయి. జేఎన్‌టీయూ నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా మరికొన్ని వెళ్తున్నాయి.
ఈ బస్సులను ప్రవేశపెట్టిన కొత్తలో మరిన్ని రూట్లకు విస్తరించాలని, బస్సుల సంఖ్యను 30 నుంచి 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ గత్యంతరం లేని పరిస్థితుల్లో 7 బస్సులను ఉపసంహరించుకుంది. బస్సుల నిర్వహణకు పెద్ద మొత్తంలో వెచ్చించడమే కాక, పెద్దసంఖ్యలో సిబ్బందిని వినియోగించాల్సి రావడంతో ఒక్కో బస్సుపై రోజూ రూ.5000 మేర నష్టాలు నమోదయ్యాయి. ప్రతి నెలా నష్టాల తీవ్రత పెరుగుతున్నా ఆర్టీసీ మాత్రం జీఎమ్మార్‌తో చెట్టాపట్టాలేసుకొని బస్సులు తిప్పుతూనే ఉంది.
10 శాతం దాటని ఆక్యుపెన్సీ
జంటనగరాల ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యానికి చేరుకొనేందుకు ప్రత్యేక బస్సులు నడపాల్సిన జీఎమ్మార్ సంస్థ ఆ బాధ్యతను టీవీఎస్ కంపెనీకి అప్పగించింది. 2009 నుంచి 2012 వరకు ‘ఎయిరో ఎక్స్‌ప్రెస్’ పేరుతో టీవీఎస్ 27 బస్సులు నడిపింది. ప్రయాణికుల ఆదరణకు నోచుకోని ఈ బస్సుల్లో ఆక్యుపెన్సీ 9 శాతం మించలేదు.
ఈలోగా జీఎమ్మార్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ముగియడంతో భారీ నష్టాలను మూటగట్టుకుని బతుకు జీవుడా అంటూ టీవీఎస్ బయటపడింది. దీంతో ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రతి అరగంటకు ఒకటి చొప్పున తిరుగుతున్న ఈ అన్ని బస్సుల్లో కలిపి రోజూ సగటున 660 నుంచి 670 మంది ప్రయాణికులే రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, మెహిదీపట్నం మార్గాల్లోనే 10 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, మిగతా రూట్లలో 8 శాతాన్ని దాటడం లేదు.
జేఎన్‌టీయూ రూట్ బాగుంది
పుష్పక్ బస్సులపై మిగతా రూట్లలో రూ.40 ఆదాయమే వస్తోంది. కొద్ది రోజులుగా జేఎన్‌టీయూ రూట్‌లో రూ.50 నుంచి రూ.60కి ఆదాయం పెరిగింది. ‘అభయ’ ఉదంతం తరువాత చాలామంది అమ్మాయిలు క్యాబ్‌ల నుంచి పుష్పక్ బస్సులవైపు వస్తున్నారు.
- ఏ.కోటేశ్వర్‌రావు, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్
పుష్పక్ విలాపం
Published Tue, Nov 19 2013 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement