
నకిలీ నోట్ల ముఠా ఆటకట్టు
కలర్ జిరాక్స్ మిషన్ సాయంతో నకిలీ రూ.2 వేల నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌వోటీ) పోలీసులు బుధవారం రట్టు చేశారు.
⇒ జిరాక్స్ మెషీన్‌పై నకిలీ రూ.2 వేల నోట్ల ముద్రణ
⇒ ఇరువురిని అరెస్టు చేసిన రాచకొండ ఎస్‌వోటీ
⇒ రూ.6.2 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: కలర్ జిరాక్స్ మిషన్ సాయంతో నకిలీ రూ.2 వేల నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌వోటీ) పోలీసులు బుధవారం రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి.. రూ.6.2 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన వ్యాపారి సాకేత్‌వాలా రమేశ్.. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇబ్రహీంపట్నా నికే చెందిన సాయినాథ్ నేతృత్వంలో మరికొందరితో కలసి ముఠా కట్టాడు. మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తుల నుంచి జిరాక్స్ మెషీన్ ద్వారా నకిలీ నోట్లు ముద్రించడం నేర్చుకున్నాడు.
ఆ ముఠా సికింద్రాబాద్‌లో ఓ కలర్ జిరాక్స్ మెషీన్‌ను ఖరీదు చేసి.. సిరిసిల్లలో దానిని ఉంచి నకిలీ నోట్లు ప్రింట్ చేయడం మొదలెట్టింది. అదే సమయంలో మరో చిన్న జిరాక్స్ మెషీన్ ఖరీదు చేసిన రమేశ్ సొంతంగా దందా ప్రారంభించాడు. తన ఇంట్లోనే మెషీన్‌ను ఉంచి పరిచయస్తులైన మహ్మద్ రియాజ్ బాబా, మహ్మద్ హాజీతో కలసి రూ.6.2 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ప్రింట్ తీశాడు. వీటిని రియాజ్ వద్దే దాచిన రమేశ్ తొలుత సాయినాథ్ ముఠా కోసం ముద్రించిన రూ.2.22 లక్షల్ని మార్పిడి చేయాలని భావించాడు. అయితే దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు గత నవంబర్‌లో సాయినాథ్, రమేశ్‌తో పాటు ఆ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు.
అప్పట్లో రమేశ్ తన సొంత దందా, హాజీ, రియాజ్‌తో కలసి ముద్రించిన నోట్ల విషయం దాచి ఉంచాడు. దీంతో రూ.6.2 లక్షల నకిలీ కరెన్సీ రియాజ్ వద్దే ఉండిపోయింది. ఆ కేసులో జైలుకు వెళ్లిన రమేశ్ జనవరి 20న బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల రియాజ్ నుంచి నకిలీ కరెన్సీ తీసుకున్న రమేశ్, హాజీ మార్పిడికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ కె.నర్సింహారావు నేతృత్వంలో ఎస్సై ఎం.కాశీవిశ్వనాథ్ తమ బృందంతో రమేశ్ ఇంటిపై దాడి చేసి.. అతడితో పాటు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న హాజీ కోసం గాలిస్తున్నారు.