హైదరాబాద్: రేడియో అక్కయ్యగా శ్రోతలకు సుపరిచితమైన ప్రముఖ రచయిత్రి తురగా జానకిరాణి బుధవారం కన్నుమూశారు. కిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జానకిరాణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేడియో అక్కయ్యగా శ్రోతల అభిమానాలను చొరగున్న జానకిరాణి వరుసగా నాలుగు సార్లు ఆకాశవాణి జాతీయస్థాయి పురస్కారాలను అందుకున్నారు. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డులో సంక్షేమ అధికారిగా పనిచేశారు. 1975-1994 సంవత్సరాలలో నిర్మాత, సహాయ సంచాలకులుగా కూడా ఆమె సేవలందించారు. జానకిరాణి స్వస్థలం మచిలీపట్నం సమీపంలోని మందపాకల.
జానకిరాణి రచయిత్రిగా మూడు కథా సంకలనాలు, రెండు నవలలు, రేడియో నాటకాల సంకలనం, 5 అనువాద గ్రంథాలు 35 పిల్లల పుస్తకాలు, అనేక వ్యాసాలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్న జానకిరాణి గృహలక్ష్మీ స్వర్ణకంకణం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలను అందుకున్నారు. మరికొన్ని ప్రక్రియల్లో కూడా ఆమె రచనలతో అందరినీ మెప్పించారు. రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి అవార్డు, సుశీల నారాయణరెడ్డి పురస్కారం, సాహితిపురస్కారాలను ఆమె అందుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో పరిణితవాణి గౌరవాన్ని జానకిరాణి అందుకున్నారు.
కాగా, జానకిరాణి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని తెలియజేశారు. జ్క్షానపీఠ పురస్కార గ్రహీత డా.సి. నారాయణరెడ్డి, తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.రాళ్లబండి కవితాప్రసాద్లు ఆమెకు సంతాపం తెలిపారు.
రేడియో అక్కయ్య కన్నుమూత
Published Wed, Oct 15 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM
Advertisement
Advertisement