ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌! సైలెంట్‌గా దాడి చేసే డేంజరస్‌ వ్యాధి! | Atrial Fibrillation Is Explained By Dr B Hygriv Rao | Sakshi
Sakshi News home page

ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌! సైలెంట్‌గా దాడి చేసే డేంజరస్‌ వ్యాధి! రోగికి వచ్చినట్లు కూడా తెలీదు..

Published Tue, Nov 28 2023 4:15 PM | Last Updated on Tue, Nov 28 2023 5:30 PM

Atrial Fibrillation Is Explained By Dr B Hygreav Rao - Sakshi

కొన్ని వ్యాధులు అంత తేలిగ్గా బయటపడవు. ఎటువంటి సంకేతాలు ఇవ్వవు. కానీ ఇతరత్ర వ్యాధులకు దారితీసేంత వరకు దాని వల్లే మనకు ఆ వ్యాధి వచ్చిందనేది కూడా తెలియదు. దీంతో పరిస్థితి విషమించిన సందర్భాలు కోకొల్లలుగా జరగుతున్నాయి. అలాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది ఈ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌(గుండెదడ). ఇదే స్ట్రోక్‌ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకంగా మారుస్తోంది. అసలు ఏంటీ ఏట్రియల్‌ ఫిబిలేషన్‌(ఏఎఫ్‌)? ఎలా సైలెంట్‌గా దాడి చేసేంత డేంజరస్‌ వ్యాధి తదితరాల గురించే ఈ కథనం!.

ఈ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌(ఏఎఫ్‌)గుండెదడ)) బాధపడుతున్న రోగులలో దాదాపు 1/3వ వంతు రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం చాలామంది రోగుల్లో ఈ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ ప్రాణాంతకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఏట్రియా అంటే గుండె గదులు. వీటిలో గుండె లయలు సక్రమంగా లేకపోతే గుండెలోని దిగువ గదులకు రక్తప్రవాహం సవ్యంగా జరగదు. దీంతో స్ట్రోక్‌ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తంచారు వైద్యులు.

నిజానికి భారతదేశంలో పలు ఆస్పత్రుల అధ్యయనాల ప్రకారం..దాదాపు 10 నుంచి 25% స్ట్రోకు రోగులకు అంతర్లీనంగా ఉన్న ఈ ఏట్రియల్‌ ఫిబ్రలేషన్‌ కారణమని చెబుతున్నారు. సుమారు మూడింట ఒక వంతు మందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. అందువల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి రావడం, జీవన నాణ్యత దారుణంగా పడిపోయింది, ప్రాణాంతక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏఎఫ్‌ని గనుక ముందుగా గుర్తించగలిగితే (ఓరల్ యాంటీ కోగ్యులెంట్ థెరపీ) నోటి ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారించే ఔషధాలతో స్ట్రోక్‌లు వంటివి రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు. 

ఎవరికీ వచ్చే ఛాన్స్‌ ఎక్కువంటే..
ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, స్థూలకాయం, టైప్‌ 2 మధుమేహం, గుండె వైఫల్యం, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, స్లీప్‌ అప్నీయా లేదా హైపర్‌ థైరాయిడిజం వంటి వైద్య పరిస్థితులతో బాధపడుతున్నవారికి ఈ ఏఎఫ్‌ బారినపడే అవకాశం ఎక్కువుగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్‌ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు మాట్లాడుతూ..చాలా సందర్భాలలో ఈ ఏఎఫ్‌ లక్షణ రహితంగా ఉంటుంది. ఈసీజీ, రొటీన్‌ చెకప్‌లు లేదా సంబంధిత స్ట్రోక్‌ కారణంగా యాదృచికంగా దీన్ని గుర్తించడం జరుగుతుంది.

ఈ ఏఎప్‌లో ముందుగా స్ట్రోక్‌ రాకుండా చూడటం అనేది అతి ముఖ్యం. ఈ వ్యాధి బారినపడిన రోగులు రక్తాన్ని పలుచగా చేసే మందులు లేదా గడ్డకట్టడాన్ని నిరోధించే మాత్రలు వాడటం అత్యంత కీలకం. సరైన చికిత్సా పద్ధతులను అనుసరించాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, అబ్స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా, ఊబకాయం, కొలెస్ట్రాల్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సక్రమమైన జీవనశైలిని పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలను అనుసరిస్తే స్ట్రోక్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా నివారించగలుగుతామని హైగ్రీవ్‌ రావు చెప్పారు. 

ఏఎఫ్‌ వచ్చిన రోగుల లక్షణాలు..

  • అలసట,  హృదయ స్పందన సరిగాలేకపోవటం 
  • దడ, గుండెలు అదరటం 
  • మైకము, మూర్ఛ
  • శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి
  • తిమ్మిరి, నీరసం, గందరగోళం
  • దృష్టి సమస్యలు
  • నడకసమస్యలు
  • మైకము, వివరించలేని తలనొప్పి వంటివి కనిపిస్తే స్ట్రోక్‌కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉదని అర్థం. 

చికిత్స

  • దీనికి మూడు ప్రధాన రకాల ఔషదాలు  ఉన్నాయి, గుండె స్పందన రేటు నియంత్రణ మందులు (హృదయ స్పందన వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి), రిథమ్ నియంత్రణమందులు (సాధారణ గుండె లయను పునరుద్ధరించడానికి పని చేస్తాయి), చివరిగా రక్తంపలచబడటానికి ( రక్తం గడ్డకట్టడం మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగించేవి) మందులు ఉంటాయి .
  • కొంతమంది రోగులకు ఎలక్ట్రికల్ కార్డియోవర్షన్ లేదా పల్మనరీ వీన్  అబ్లేషన్ వంటి శస్త్ర చికిత్సలు అవసరం. 

వీటితో పాటుగా , ధూమపానానికి దూరంగా ఉండటం, గుండె ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్నే తీసుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యం. వీటన్నింటిని పాటిస్తే ఈ ఏఎఫ్‌ సమస్య నుంచి సత్వరమే బయటపడొచ్చని అంటున్నారు కిమ్స్‌ వైద్యులు హైగ్రీవ్‌ రావు.

--కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్‌ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు

(చదవండి: ‘కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌' అంటే? తలెత్తే సమస్యలు..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement