
పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డంకి
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డంకి అని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. అందుకే పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు ఎన్ తులసి రెడ్డి, సూర్యా నాయక్, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతమ్, గిడుగు రుద్రరాజు, రాజా, కిసాన్ సెల్ చైర్మన్ కే రవిచంద్రారెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు.
పోలవరాన్ని ముందుకుతీసుకెళ్లడం చంద్రబాబుకు, కేంద్రానికి ఇష్టంలేదని రఘువీరా అన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్కు జరిగే పరిణామాలేంటో చంద్రబాబు గ్రహించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు టీప్రాజెక్టులపై మౌనంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును చంద్రబాబు నిలదీయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం నిర్మాణపు పనులు, అనుమతులు, పర్యవేక్షణ, పునరావాస వసతి, 2018లోపు ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి అంశాలున్నాయని రఘువీరా చెప్పారు. చట్టంలో ఉన్న ప్రతిదాన్ని కేంద్రప్రభుత్వమే అమలు చేయాలని, పోలవరంపై చంద్రబాబు పర్యవేక్షణ అవసరంలేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 32 శాతం పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు అధికారం చేపట్టి 26 నెలలు గడిచినా పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించి 2018లోపు పూర్తయ్యే విధంగా చంద్రబాబు పోరాడాలని రఘువీరా డిమాండ్ చేశారు.