తాకట్టు ప్లాట్‌ఫామ్‌పై రైల్వే స్టేషన్ | railway station platform in lease | Sakshi
Sakshi News home page

తాకట్టు ప్లాట్‌ఫామ్‌పై రైల్వే స్టేషన్

Published Wed, Jan 27 2016 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

తాకట్టు ప్లాట్‌ఫామ్‌పై రైల్వే స్టేషన్

తాకట్టు ప్లాట్‌ఫామ్‌పై రైల్వే స్టేషన్

సికింద్రాబాద్ స్టేషన్‌ను ప్రైవేటుకు అప్పగించే యోచనలో రైల్వే
రైల్వే విస్తరణ, అభివృద్ధికి ‘ప్రైవేటు’ రుణాలు
అప్పులిచ్చే సంస్థలకు రైల్వేస్టేషన్‌ల అప్పగింత
వాణిజ్య సముదాయాలుగా మార్చాలని నిర్ణయం
ఆసక్తి చూపుతున్న సంస్థలతో సంప్రదింపులు
దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్‌లకూ ఇదే రూపు

 
సాక్షి, హైదరాబాద్:
అదో భారీ వాణిజ్య సముదాయం.. నాలుగైదు అంతస్తుల్లో పెద్ద పెద్ద మాల్స్.. సినిమా థియేటర్లు.. దుకాణాలు.. హోటళ్లు.. పైభాగంలో కొన్ని ప్రైవేటు కార్యాలయాలు.. కానీ భవనం కింది అంతస్తులో మాత్రం హడావుడిగా వెళుతున్న ప్రయాణికులు, ఆ పక్కనే కూ.. అని కూత పెడుతూ వస్తూ పోతూ ఉన్న రైళ్లు.. ఇదీ భవిష్యత్తులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపు. మరి ఇంతలా అభివృద్ధి చేసేది రైల్వేశాఖ కాదు.. బడా ప్రైవేటు సంస్థలు. రైల్వే విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ప్రైవేటు సంస్థల నుంచి రుణాలు తీసుకుని.. తనఖాగా వాటికి రైల్వేస్టేషన్లను అప్పగించేందుకు  రైల్వేశాఖ సిద్ధమైంది. పనిలోపనిగా కీలకమైన ప్రాంతాల్లో ఉండే రైల్వేస్టేషన్లను భారీ వాణిజ్య సముదాయాలుగా మార్చి ఆదాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
 
 ఒక్కమాటలో చెప్పాలంటే... అభివృద్ధి కోసం అప్పు, ఆ అప్పు కింద తనఖాగా రైల్వేస్టేషన్లు. ఇది రైల్వే శాఖ కొత్తగా ఎత్తుకున్న నినాదం. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వేను అభివృద్ధి చేయడం తలకుమించిన పనిగా మారింది. ఒక్క మన రాష్ట్రంలోనే ఇప్పటికిప్పుడు ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వేలను అభివృద్ధి చేయాలంటే కావాల్సిన నిధులు రూ. 50వేల కోట్లు. కానీ ఏటా బడ్జెట్‌లో రైల్వే శాఖ కేటాయిస్తున్న మొత్తం రెండుమూడు వేల కోట్లను మించడం లేదు. తదుపరి బడ్జెట్ వచ్చేసరికి నిధుల అవసరం మరింతగా పెరిగిపోతూనే ఉంది. దీంతో రైల్వే శాఖ చేతులెత్తేయడంతో కేంద్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా భారత రైల్వేలో పెట్టుబడులపై ఆయా దేశాల వ్యాపార దిగ్గజాలతో మాట్లాడుతున్నారు. ఈలోపే దేశీయంగా అప్పులు తెచ్చి అవసరాలు తీర్చుకునే దిశగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగా ఎల్‌ఐసీ నుంచి దాదాపు రూ.లక్షన్నర కోట్లు రుణం పొందేందుకు ఒప్పందం చేసుకుంది. మరిన్ని బడా ప్రైవేటు సంస్థలతో కూడా చర్చిస్తోంది. రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రధాన రైల్వేస్టేషన్లను తనఖాగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదే సమయంలో దేశంలోని ప్రధానమైన వంద రైల్వేస్టేషన్‌లను వాణిజ్య సముదాయాలుగా మార్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. అందులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఒకటి.
 
 ఏం చేస్తారు?
 ప్రస్తుతం మన దగ్గర రైల్వేస్టేషన్లు విశాలంగానే ఉన్నాయి. కానీ ఆ భవనాల పైభాగం నిరుపయోగంగా ఉంటోంది. అలా కాకుండా ఆ స్టేషన్ భవనాల స్థలంలో ఎక్కువ అంతస్తులతో భారీ భవన సముదాయాన్ని నిర్మించి, షాపింగ్ మాల్స్, దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని రైల్వేశాఖ లెక్కలు వేసుకుంది. కానీ అలా భారీ భవనాలను సొంతంగా నిర్మించగలిగేటన్ని నిధులు రైల్వే వద్ద లేవు. దీంతో ప్రైవేటు సంస్థలపై దృష్టి సారించింది. వాణిజ్య సముదాయాలుగా మారిస్తే వచ్చే ఆదాయం ఎంతుంటుందనే లెక్కలను బడా సంస్థల ముందు పెట్టబోతోంది. రైల్వే విస్తరణ, అభివృద్ధి పనులకు రుణమిచ్చే సంస్థలకు రైల్వేస్టేషన్లను కట్టబెట్టాలన్న యోచనలో ఉంది. దీనికి ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం.

ఆయా రైల్వేస్టేషన్ల ప్రాంగణాన్ని పొందిన సంస్థలు వాటి ప్రణాళిక ప్రకారం వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటాయి. రైల్వే ప్రయాణ ప్రాంగణాలు, రైళ్లు నిలిచే ప్రాంతాలతో వాటికి సంబంధం ఉండదు. అవసరమైతే ప్రయాణికుల ప్రాంగణాలకు ప్రైవేటు సంస్థలే ఆధునిక రూపు ఇస్తాయి. అయితే ఇది ఆయా సంస్థలు-రైల్వే మధ్య కుదిరే ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. వచ్చే రైల్వే బడ్జెట్ తర్వాత దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
 
 మోదీ మోడల్‌లో...
 అభివృద్ధి పనులకు ప్రభుత్వ ఆస్తులను వాడుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలకు ప్రత్యేకత ఉంది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఈ తరహా ప్రణాళికలతో ఆయన విజయం సాధించారు. దేశంలోనే తొలిసారిగా వదోదర బస్టాండును అంతర్జాతీయ స్థాయిలో భారీ వాణిజ్య సముదాయంగా మార్చారు. ఆ బస్టాండు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి మాల్‌గా వెలుగొందుతోంది. ఇదే తరహాలో మరికొన్ని బస్టాండ్లు కూడా రూపు మార్చుకోబోతున్నాయి. ఆ ఫార్ములానే రైల్వేలకు కూడా వర్తింపచేయాలన్న ప్రధాని మోదీ ఆలోచనను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆచరణలో పెట్టబోతున్నారు.
 
 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రత్యేకతలు
 
 వయస్సు: 142 ఏళ్లు
 నిర్మాణం: నిజాం హయాంలో 1874లో దీన్ని నిర్మించారు. తెలంగాణ ప్రాంతంలో తొలి రైల్వేస్టేషన్ ఇదే. మహారాష్ట్రలోని వాడి నుంచి తొలి రైలు ఇక్కడికి వచ్చి మళ్లీ వాడికి ప్రయాణం చేసింది.
 వ్యవస్థ: ఇక్కడ మొత్తం పది ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. 11 లైన్లు ఏర్పాటయ్యాయి.
 ఎన్ని రైళ్లు: నిత్యం ఈ రైల్వేస్టేషన్ మీదుగా 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100 ప్యాసింజర్ రైళ్లు, 100 వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు కొనసాగుతుంటాయి. వీటికి సరుకు రవాణా రైళ్లు అదనం.
 ఆదాయం: నిత్యం ఈ స్టేషన్ ద్వారా రైల్వేకు రూ. కోటీ తొంభై లక్షల ఆదాయం సమకూరుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement