సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకున్న విధ్వంసం కేసులో సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావు ఇప్పటికీ జీఆర్పీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇతడితో సహా మొత్తం ఎనిమిది మందికి శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించారు. ఆపై వీరందరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
వీరిలో సుబ్బారావుతో పాటు ఇద్దరు వేర్వేరు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఒకరు మహబూబ్‌నగర్‌కు చెందిన నాయక్ బీసంరెడ్డి కాగా మరొకరు కరీంనగర్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. సుబ్బారావు సూచనల మేరకు ఆర్మీ అభ్యర్థులకు రెచ్చగొట్టడంలో అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ కీలక పాత్ర పోషించడంతో వీరినీ కటకటాల్లోకి పంపారు. రెడ్డప్ప, హరి సహా మిగిలిన వాళ్లు విధ్వంసంలో పాత్రధారులుగా తెలుస్తోంది.
ఆర్థికంగా నష్టపోతాననే భయంతోనే..
అగ్నిపథ్ స్కీమ్ అమలైతే ఆర్థికంగా నష్టపోతానని భావించిన సుబ్బారావు తనకు సంబంధించిన 12 బ్రాంచ్‌ల నిర్వాహకులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, విజయవాడ, విశాఖపట్నంలోని ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన వారిని సంప్రదించాడు. వీరందరితో కలిసే ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టడం ద్వారా ఆందోళన చేయించాలని పథకం వేశాడు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కేంద్రం ఈ స్కీమ్‌ను ఉపసంహరిస్తుందని భావించాడు. ఆందోళనల కోసం ఏర్పాటైన ఎనిమిది వాట్సాప్ గ్రూపుల్లో పలువుర్ని సభ్యులుగా చేర్చాడు. అయితే కనీసం ఒక్క దాంట్లో కూడా సుబ్బారావు చేరలేదు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి చెందిన ఆర్మీ అభ్యర్థులు హైదరాబాద్ రావడానికి సహకరించాడు. 16వ తేదీ రాత్రి నరసరావుపేట నుంచి హైదరాబాద్ చేరుకున్న సుబ్బారావు బోడుప్పల్‌లో బస చేశాడు. తాను హైదరాబాద్ వచ్చానని, మరుసటి రోజు ఉదయం (17న) స్వయంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వస్తానంటూ మల్లారెడ్డి, శివల ద్వారా ప్రచారం చేయించాడు. అయితే ఆ రోజు అతడు బోడుప్పల్ నుంచి బయలుదేరడం కాస్త ఆలస్యమైంది.
సుబ్బారావు ఉప్పల్ వరకు చేరుకునే సమయానికే రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆందోళన విధ్వంసంగా మారిపోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సైతం కాల్పుల వరకు వెళ్లారు. ఈ విషయాలు తెలియడంతో సుబ్బారావు ఉప్పల్ నుంచే ఖమ్మం పారిపోయాడు. ఈ వ్యవహారంలో సుబ్బారావు పాత్ర లేదని, ఆయన అకాడమీలకు చెందిన అభ్యర్థులు అంతా కేవలం నిరసనలో మాత్రమే పాల్గొన్నారని, స్టేషన్ బయటనే ఉన్నారని పోలీసులతో చెప్పాలంటూ మల్లారెడ్డి, శివల ద్వారా విధ్వంసంలో పాల్గొన్న అభ్యర్థులకు సూచించాడు. కొందరు ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ చేరుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం కూడా సుబ్బారావు చేసినట్లు సమాచారం.
మరోపక్క ప్రస్తుతం రిక్రూట్‌మెంట్ సాగుతున్న అభ్యర్థుల నుంచి ఇతడికి రూ.50 కోట్లు వరకు వసూలు కావాల్సి ఉందని తెలుస్తోంది. బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డికి రైల్వే పోలీసులు శుక్రవారం రైల్వే యాక్ట్‌లోని 179 (2) సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. సుబ్బారావు అరెస్టుకు సిద్ధమవుతూనే ఇవి ఇచ్చినట్లు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం జరిగిన రోజు పోలీసు కాల్పుల్లో రాకేష్ కన్నుమూశాడు.
ఈ విషయాన్నీ జీఆర్పీ పోలీసులు కేసులో చేర్చారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వేపోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నెం.227/2022 కింద ఈ కేసు నమోదైంది. ఇందులో ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని 15 సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఇందులో నిందితులుగా గుర్తుతెలియని వారుగా పేర్కొన్నారు. ఈ నెల 19న 45 మందిని అరెస్టు చేసినప్పుడు ఈ కేసులో కుట్ర సెక్షన్‌ను జోడించారు. నిందితులుగా 56 మంది పేర్లు చేర్చారు.
ఈ నెల 21న మరో పది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుల సంఖ్య 63గా పేర్కొన్న పోలీసులు సీఆర్పీసీలోని 174వ సెక్షన్‌ను కేసుకు జోడిస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ కేసులో మొత్తం నాలుగు చట్టాలకు సంబంధించిన 17 సెక్షన్లు ఆరోపణ చేసినట్లు అయింది. రాకేష్ మరణం నేపథ్యంలోనే దీన్ని చేర్చిన జీఆర్పీ పోలీసులు దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ సమయంలో ఈ సెక్షన్ తొలగించనున్నారు. ఆవుల సుబ్బారావు సహా మిగిలిన నిందితులను శనివారం అరెస్టు ప్రకటించనున్నారని తెలుస్తోంది.
(చదవండి: రైల్వే స్టేషన్ ఘటన: సాయి డిఫెన్స్ అకాడమీదే కీలక పాత్ర!)
Comments
Please login to add a commentAdd a comment