ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(సీపీ) కాంతిరాణా చెప్పారు. కమిషనర్ ఆఫీసులో సోమవారం(ఏప్రిల్15) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు.
‘ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సుయాత్ర కొనసాగింది. యాత్ర సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రొటోకాల్ ప్రకారం కరెంట్ నిలిపివేశాం.
సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట ముందుగానే కరెంట్ నిలిపివేస్తారు. బస్సుయాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించాం. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది.
దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి.. సీఎం జగన్‌పై దాడి.. నిందితులను పట్టుకుంటే బహుమతి
Comments
Please login to add a commentAdd a comment