జూన్ 11న రాజ్యసభ పోలింగ్ | Rajya Sabha polls on June 11 | Sakshi
Sakshi News home page

జూన్ 11న రాజ్యసభ పోలింగ్

Published Wed, May 25 2016 1:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

జూన్ 11న రాజ్యసభ పోలింగ్ - Sakshi

జూన్ 11న రాజ్యసభ పోలింగ్

- ఏపీలో మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ
నాలుగు సీట్లలో మూడు టీడీపీ, ఒకటి వైఎస్సార్‌సీపీ గెలుచుకునే అవకాశం

 సాక్షి, హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 31 వరకు ఏపీ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ వరకు గడువుంది.  జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి సంబంధించి జూన్ 21న నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. నలుగురు కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే జూన్ 11న ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్లు లెక్కిస్తారు. జూన్ 13 నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు. రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా.. నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాలు మాత్రమే అధికార తెలుగుదేశం కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక స్థానాన్ని విపక్ష వైఎస్సార్‌సీపీ గెలుచుకోనుంది.  

 సుజనా చౌదరికి మళ్లీ అవకాశం!
 ఏపీకి సంబంధించి వచ్చే నెలలో రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న వారిలో టీడీపీ తరఫున కేంద్ర మంత్రులు వై.ఎస్.చౌదరి (సుజనాచౌదరి), నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రులు జేడీ శీలం, జైరాం రమేశ్ ఉన్నారు. సుజనా చౌదరిని మళ్లీ రాజ్యసభకు పంపాలని చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వొద్దని లోకేశ్ గట్టిగా పట్టుపడుతున్నా గతంలో చేసిన సాయానికి ప్రతిఫలంగా మరోసారి సీటు ఇవ్వక తప్పదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. రెండో సీటును మిత్రపక్షం బీజేపీకి (నిర్మలా సీతారామన్‌కు) చంద్రబాబు కేటాయించనున్నారు.

ఇక మూడో సీటును బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గాలకు ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. బీసీ కోటాలో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పేరు పరిశీలనలో ఉంది. బీసీ కోటాలోనే కర్నూలు జిల్లా నుంచి గతంలో రెండు విడతలు లోక్‌సభకు పోటీచేసి ఓడిన బీటీ నాయుడు పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఇలావుండగా కాపు సామాజికవర్గానికి ఓ రాజ్యసభ సీటు ఇవ్వాలని కాపు సంఘాల నేతలు ఇటీవల చంద్రబాబును కలసి కోరారు. గుంటూరు జిల్లా పార్టీ నేత దాసరి రాజా మాస్టారు పేరును పార్టీ నేతలు కొందరు సూచించినట్టు సమాచారం. ఇదే సామాజికవర్గానికి చెందిన చిక్కాల రామచంద్రరావు కూడా సీటు ఆశిస్తున్నారు. ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే హేమలత పేరుతో పాటు జేఆర్ పుష్పరాజ్, వర్ల రామయ్య, లలితా థామస్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కంభంపాటి రామ్మోహనరావు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement