హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి, రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.45 వేల కోట్ల నిధులను దారిమళ్లించారని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను.. ఎస్సీ వర్గాల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని రావెల స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-16లో రూ.1000 కోట్లను రుణాలుగా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎన్టీయార్ విద్యోన్నతి పథకం ద్వారా 300 మంది ఎస్సీ విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపామని చెప్పారు.
ఎస్సీ విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు, సాంఘిక సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు భోదన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు విప్రో సంస్థ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీతో చర్చిస్తామని చెప్పారు. పేద కుటుంబాల్లో ఎవరూ పుట్టాలని కోరుకోరని చెప్పే క్రమంలో సీఎం చంద్రబాబు అన్న మాటలను వైఎస్సార్‌సీపీ నేతలు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరూ కోరుకోరని చంద్రబాబు అన్న మాటలను సమర్థిస్తున్నారా అని విలేకరులు రావెలను ప్రశ్నించారు. అయితే అందుకు సమాధానాన్ని మంత్రి రావెల దాటవేయడం కొసమెరుపు.