రావెల రాజీనామా చేయాల్సిందే
ఏపీ మంత్రుల్లో రావెల కిశోర్‌బాబు గిరిజన శాఖ మంత్రిగా ఉండటం సిగ్గుచేటుగా భావిస్తున్నామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. గతంలో తాము ఏమైనా మాట్లాడితే అజ్ఞానులు అనేవారని, కానీ కిశోర్ బాబు 55 ఎకరాల అసైన్డ్ భూములను స్వాహాచేయడమే కాక, ఆయన కుమారుడు ఒక టీచర్‌పై అత్యాచారయత్నం చేయడం దారుణమని, అతడిని అరెస్టు చేయాలని, రావెల తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధాని అంటున్నారు గానీ, పేద రైతులు, పేద కూలీలను మోసగిస్తూ వాళ్ల భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో స్వాహా చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు, మంత్రులు అందరూ బినామీ పేర్లతో భూములను ఆక్రమించుకున్నారని, ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా మునిగిపోయి వీటిని పట్టించుకోవడం లేదని ఆర్కే మండిపడ్డారు.
రాజధాని అభివృద్ధి పేరుతో రైతులను భయపెట్టి, హింసించి, వాళ్ల పొట్టగొట్టి భూములు లాక్కున్నారని, ఆ డబ్బును ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేందుకు ఉపయోగిస్తున్నారని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. మంత్రులు భూములు కొనుక్కుంటే తప్పేంటని అనడం దురదృష్టకరమని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.