గ్రూప్-2 కోసం పక్కా ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్షలను నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనన్ని ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్తుపరంగా అంతరాయం లేకుండా చూడటంతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అరుుంది. జిల్లా కలెక్టర్లతోనూ ఏర్పాట్లపై సమీక్షించింది. నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకు 12న సెలవు
ఈ నెల 11, 13వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 12వ తేదీన సెలవు దినమేనని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి 12వ తేదీ రెండో శనివారం సెలవు దినమే. కానీ వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో సెప్టెంబరు 15వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దానికి ప్రత్యా మ్నాయంగా ఈ నెల 12న పాఠశాలలు నిర్వహించాలని పేర్కొంది. అరుుతే గ్రూప్-2 రాత పరీక్ష 11వ తేదీన, 13వ తేదీన ఉంది. 12వ తేదీన కనుక జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యాసంస్థలు కొనసాగితే ఆ పరీక్ష కేంద్రాల్లో 11వ తేదీన పరీక్ష కోసం వేసిన హాల్‌టికెట్ల నంబర్లను 12వ తేదీన విద్యార్థులు తుడిచివేసే అవకాశముంది. మళ్లీ 13వ తేదీన పరీక్ష ఉన్నందున 12న మళ్లీ హాల్‌టికెట్ నంబరు వేయాలంటే కష్టంగా మారనుంది. దీంతో 12న సెలవు దినంగా ప్రకటించింది. విద్యాశాఖతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకే ఇది వర్తిస్తుంది. మిగతా విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయి.