విద్యార్థిని పేర నకిలీ పత్రాలను సృష్టించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కాజేసిన ఓ కాలేజీ యాజమాన్యం పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
► విద్యార్థిని ఫీజురీయింబర్స్ కాజేసిన అనిత ఇంజినీరింగ్ కాలేజ్
► కళాశాల చైర్మెన్ అరెస్ట్
కుషాయిగూడ: విద్యార్థిని పేర నకిలీ పత్రాలను సృష్టించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కాజేసిన ఓ కాలేజీ యాజమాన్యం పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అశ్విత ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్‌తో కలిసి సోమవారం విలేకరులకు వివరించారు. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం లోయపల్లి గ్రామానికి చెందిన గుగులోతు అనిత అనే వివాహిత అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో 2013–14 విద్యా సంవత్సరంలో ఎంటెక్ అడ్మిషన్ తీసుకుంది.
ఎస్టీ సామాజికవర్గం కావడంతో ఆమె ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అన్ని పత్రాలు జతపరిచి రంగారెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. కొద్ది రోజులు కళాశాలకు వెళ్లిన అనిత గర్భవతి కావడంతో కళాశాలకు వెళ్లలేక పోయింది. తనను పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సిబ్బందిని కోరగా కళాశాల అభివృద్ధికి సంబంధించి రూ. 5,500 ఫీజు చెల్లిస్తే అనుమతిస్తామన్నారు. ఆమెకు ఫీజు చెల్లించడం వీలు కాకపోవడంతో పరీక్షలు రాయలేదు. తరువాత చదువుకోవడం వీలుపడక పోవడంతో టీసీ కోసం కళాశాలకు వెళ్లింది. సెకెండ్ ఇయర్ ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. అయితే అనిత మొదటి సంవత్సరం కళాశాలకు హాజరైనట్లు, పరీక్షలు రాసినట్లు నకిలీ పత్రాలు, మెమోలను తయారు చేసిన కళాశాల యాజమాన్యం సెకండ్ ఇయర్‌కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసింది. అందుకు సంబంధించి అనిత అకౌంట్‌లోకి వచ్చిన రూ. 57 వేలు రీయింబర్స్‌మెంట్ డబ్బును అప్పటికే డ్రా చేసుకుంది. తిరిగి డబ్బులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని బుకాయించారు.
ఇదిలా ఉండగా ఆమె అకౌంట్‌లో హాస్టల్ ఫీజుకు సంబంధించిన రూ. 6,400 జమయ్యాయి. అనుమానం కలిగిన అనిత ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా సెకండ్ ఇయర్‌కు కూడా రీయింబర్స్‌మెంట్ డబ్బు మంజూరైనట్లు తెలిసింది. తన వేలి ముద్రలు లేకుండా ఏ విధంగా అప్రూవల్ చేశారంటూ అధికారులను నిలదీసి కళాశాల యజమాన్యంపై కీసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసులకు వాస్తవాలు వెలుగులోకి రావడంతో కళాశాల చైర్మన్ వసంత తరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వివరించారు. ట్రైబల్ వేల్పేర్ అధికారులపై కూడా విచారణ చేపడతామన్నారు. నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటుఅట్రాసిటీ కేసును కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కీసర, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్లు గురువారెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.