
గ్రేటర్‌లో 226 పోస్టుల భర్తీ
- 200 టీపీఏ/టీపీఎస్.. 26 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు
- గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు.. త్వరలో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో 226 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో 200 టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు(టీపీఎస్)/టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్(టీపీఏ) పోస్టులతో పాటు హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో మరో 26 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలకు ఇటీవల సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఈ పోస్టుల భర్తీకి చర్య లు తీసుకోనున్నారు.
మహానగరంలో అనధికార నిర్మాణాల తొలగింపు, రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టడంలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలకపాత్ర పోషి స్తోంది. ఈ విభాగంలో చీఫ్ సిటీ ప్లానర్ నుండి సర్వేయర్ వరకు 412 మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 135 మందే విధులు నిర్వర్తిస్తు న్నారు. నగరాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడానికి ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పురపాలక మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. సీఎం ఆదేశాల మేరకు పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. సీఎం ఆమోదించడంతో త్వరలో ఈ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.