పే...ద్ద జెండాకు ప్రణామం!
సిటీబ్యూరో: ‘హమారా ఇండియా...హమారా హైదరాబాద్...హమారా జెండా..’అంటూ నగరవాసులతో పాటు సిటీ అందాలను చూసేందుకు వచ్చేవారిలో దేశభక్తి వెల్లివిరిసేలా చేస్తోంది నగరంలోని అతిపెద్ద జెండా. సంజీవయ్య పార్కులో గతేడాది జూన్‌లో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఇప్పుడు లక్షలాది మంది సందర్శిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ తీరాన..పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతీయ జెండా రెపరెపలాడుతూ భారతావని కళ్ల ముందు కదలాడుతున్నట్టుగా మురిపిస్తోంది. ఆ జెండా చూసిన ఎవరైనా సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు. దాదాపు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వచ్చే బలమైన గాలులను తట్టుకొని జెండా రెపరెపలాడుతున్న తీరు అద్భుతంగా ఉంది.
భారీగా ఖర్చు...
గతేడాది జూన్ 2 వతేదీన తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో ఈ అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ పతాకం నిర్వహణ బాధ్యతను చూసుకుంటున్న హెచ్‌ఎండీఏ ఎక్కడా లోటుపాట్లు లేకుండా జాగ్రత్తపడుతోంది. దీని నిర్వహణ కోసం ఏకంగా ఏడాదికి రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వెచ్చిస్తోంది. తరచూ బలమైన గాలులు వీస్తున్నందున ఇక్కడ ప్రతి నెలా రెండు జెండాలు అవసరమవుతున్నాయి. ఒక్కో జెండా కోసం రూ.1.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక విద్యుత్ చార్జీలు, డీజిల్ జనరేటర్ నిర్వహణ, జెండాను ఎత్తడానికి దించడానికి సిబ్బంది, రక్షణ...ఇలా అన్నీ కలిపి నెలకు దాదాపు రూ.3.8 లక్షల వరకు వ్యయమవుతోంది. గతేడాది జూన్ రెండు నుంచి ఇప్పటివరకు దాదాపు 14కుపైగా జెండాలు మార్చారు. రోజుకు షిఫ్ట్‌ల వారీగా ముగ్గురు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇక్కడ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నారు.
రెండుసార్లు జాతీయ గీతాలాపన...
ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో, మళ్లీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత సిబ్బంది ఈ జెండా వద్ద జనగణమన గీతాలాపన చేస్తారు. ఈ జెండాను చూసేందుకు వచ్చిన సందర్శకులు తమ సెల్‌ఫోన్లలో జాతీయ గీతం పాటను ఆన్‌చేసి మరీ జెండాకు సెల్యూట్ చేస్తూ తమ గొంతుకను కూడా కలుపుతున్నారు. ఎక్కువగా పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రాంతాల పర్యాటకులు సందర్శిస్తున్నారు. నెలకు దాదాపు లక్ష మందికిపైగా జాతీయ జెండాను చూసేందుకు వస్తున్నారు. సూర్యాపేటలోని డీఆర్‌డీఏలో పనిచేసే కె.సంజీవరావు తయారుచేసిన ఈ జాతీయ జెండాకు ఎంతో మంది నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక్కో జెండాను రెడీ చేసేందుకు 15 రోజుల సమయం అవసరమని, దాదాపు పదిమంది వర్కర్లు అవసరమవుతారని నిర్వాహకులు తెలిపారు.
జాతీయ జెండా నిర్వహణ సంతోషదాయకం...
జాతీయ జెండా నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. నెలకు ఒకటి రెండుసార్లు జెండా ఆవిష్కరించేటప్పుడు, దింపేటప్పుడు సిబ్బంది చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలుతురులో కనిపించేందుకు జెండా చుట్టూ బల్బులను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచుతాం. ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో జెండా చిరిగిపోయే ఘటనలు చోటుచేసుకుంటాయి. అందుకే అప్రమత్తంగా ఉంటాం. జెండా నిర్వహణ విషయంలో హెచ్‌ఎండీఏ అధికారుల నుంచి పూర్తి సహకారం ఉంది. జాతీయ జెండాకు సేవ చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నా. – పద్మావతి, జెండా నిర్వాహకురాలు
చాలా గర్వంగా ఉంది...
ఇంత పెద్ద జాతీయ జెండాను దగ్గరి నుంచి చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దేశంలోనే అతి పొడవైన జెండాను భాగ్యనగరంలో ఏర్పాటు చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ తిరంగాను చూసినప్పుడు మనకు తెలియకుండానే మనసులో దేశభక్తి భావం కలుగుతుంది. గణతంత్ర దినోత్సవానికి ఒకరోజూ ముందు ఈ జెండాను చూడాలనే ఆశతో వచ్చా. భారత్ మాతాకీ జై.
– వెంకటేశ్, డిగ్రీ విద్యార్థి