నామినేటెడ్ పదవులకు శ్రీకారం
♦ తొలి విడతలో పది మార్కెట్లకు కమిటీల నియామకం
♦ దేశంలో తొలిసారిగా రిజర్వేషన్లు
♦ నూతన కమిటీల పదవీ కాలం ఏడాది
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం మార్కెట్ కమిటీల వారీగా పాలక మండళ్ల జాబితాకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 179 వ్యవసాయ మార్కెట్లకుగాను 11 కమిటీలను పీసా చట్టం కింద గిరిజనులకు ప్రత్యేకించారు. మిగతా 168 వ్యవసాయ మార్కెట్లకుగాను తొలి విడతలో నాలుగు జిల్లాల పరిధిలోని 10 కమిటీలకు పాలక మండళ్లను ప్రకటించారు.
వీటిలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వంటిమామిడితోపాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నాలుగు వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటితోపాటు కరీంనగర్ జిల్లాలో నాలుగు మార్కెట్ కమిటీలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర కమిటీకి తొలి జాబితాలో చోటు దక్కింది. కాగా, దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ మార్కెట్ పాలక మండళ్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు ఓసీ జనరల్ స్థానాలకుగాను మూడింట బీసీలకు చైర్మన్ పదవులు దక్కాయి. నిజామాబాద్ ఎంపీ కవిత, మెట్‌పల్లి ఎమ్మెల్యే సిఫారసు మేరకు కరీంనగర్ జిల్లాలో నాలుగు వ్యవసాయ మార్కెట్లకు పాలక మండళ్లను నియమించారు. నూతన పాలక మండళ్ల పదవీ కాలపరిమితి ఏడాది కాగా.. మరో ఏడాది కూడా పొడిగించే అవకాశమున్నట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి.
దశల వారీగా మిగతా కమిటీలు: హరీశ్
దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు ప్రవేశ పెడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమించినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఏకాభిప్రాయం కుదిరిన చోట వెంట వెంటనే దశల వారీగా పాలక మండళ్ల నియామకం జరుగుతుందన్నారు. నెలాఖరులోగా మెజారీటీ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమించే అవకాశం ఉందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతోపాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లను తొలిసారిగా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో రాష్ట్రంలో 149 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేసిన 30 కమిటీలను కలుపుకుని రిజర్వేషన్లు నిర్ణయించామన్నారు.