ప్రభుత్వం తెచ్చినది భూకబ్జా చట్టం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: జనవరి 2014 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, ఆ తేదీ నుంచి చట్టం అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూసేకరణ చట్టాన్ని తీసుకురావడం ఎలా సాధ్యమని టీడీఎల్పీనేత ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రం పుట్టకముందే చట్టం పుట్టిందా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల నుంచి భూమిని బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకుని, భూమిని కోల్పోయిన నిర్వాసితుల బాధ్యతలను పట్టించు కోకుండా ఉండటానికి జీఓ 123, జీఓ 254, జీఓ 190, జీఓ 192లను తెచ్చిందన్నారు. నిర్వాసితులను మోసం చేసేవిధంగా ఉన్న ఈ జీఓలను హైకోర్టు కొట్టివేసిందని రేవంత్‌రెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2013కు తూట్లుపొడిచే విధంగా, అడ్డదారిలో కొత్తచట్టం తీసుకువచ్చేందుకు ఎత్తులు వేశారని విమర్శించారు. ప్రాజెక్టులకు సంబం ధించిన డీపీఆర్ లేకుండా, రైతులతో సంప్రదించకుండా, గ్రామసభను పట్టించుకో కుండా, కలెక్టర్లు అనుకున్న ధరకు, ఇష్టారాజ్యంగా రెండు పంటలు పండే భూముల ను కూడా రైతుల నుంచి ఈ చట్టం ద్వారా తీసుకుంటారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం భూకబ్జా చట్టం అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రం పుట్టకముందే చట్టం పుట్టిందా?
Published Thu, Dec 29 2016 12:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement